కేసీఆర్‌పై చంద్ర‌బాబు కామెంట్లు.. ఏపీ మంత్రుల ఉలికి'పాట్లు'..

అప్ప‌ట్లో హాట్ హాట్‌గా న‌డిచింది. ఇప్పుడు చ‌ల్ల‌బ‌డింది. బ‌హుషా అందుకే కాబోలు మ‌ళ్లీ వేడి రాజేస్తున్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య రెండు పార్టీలు అగ్గి ఎగ‌దోసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అవ‌స‌రం ఉన్నా లేకున్నా ఏపీ ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఆయ‌న అంతేసి మాట‌లు అన‌గానే.. వీళ్లు ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇవ్వ‌క త‌ప్ప‌నిసరి ప‌రిస్థితి వ‌స్తోంది. ఇలా కేసీఆర్ వ‌ర్సెస్ వైసీపీ నేత‌లు.. టామ్ అండ్ జెర్రీలా ఆటాడుకుంటున్నారు. ఇదంతా జ‌స్ట్ ఆట‌నో.. లేక రియ‌లో తెలీక ప్ర‌జ‌లు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. మ‌ధ్య‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎంట‌రై రాజ‌కీయాన్ని మ‌రింత రంజుగా మార్చేస్తున్నారు. ఇంత‌కీ తెలుగురాష్ట్రాల మ‌ధ్య ఈ గోలేంటి? ఈ గ‌డిబిడి రాజ‌కీయ‌మేంటి?

మాట‌ల మాంత్రికుడు కేసీఆర్‌.. ఇటీవ‌ల పార్టీ ప్లీన‌రీలో ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప‌రువంతా తీసేశారు. ఏపీ క‌రెంట్ కోత‌ల‌తో విల‌విల్లాడుతోంద‌ని.. బొగ్గు కొర‌త వేధిస్తోంద‌ని.. ఆంధ్ర‌ అప్పుల మ‌యంగా మారిందంటూ.. ఇజ్జ‌త్ మొత్తం పోగొట్టారు. స‌రైన నాయ‌క‌త్వం, పాల‌నా ద‌క్ష‌త లేక‌పోతే.. రాష్ట్రం ఏపీలా అథోగ‌తి పాల‌వుతుందంటూ త‌న‌ని తాను పొగుడుకుంటూ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ను ఏకిపారేశారు. తెలంగాణ ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాల‌ను చూసి.. ఏపీలో పార్టీ పెట్టాలంటూ అక్క‌డి ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారంటూ త‌న‌దైన స్టైల్‌లో మంట రాజేశారు. అంతే. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. క‌రెంట్ క‌ష్టాలు, అప్పుల తిప్ప‌ల‌పై.. ప‌క్క రాష్ట్ర సీఎం మాట్లాడ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌ ప‌రువంతా కృష్ణాలో క‌లిసిపోయింది. దీంతో.. ఏపీ మంత్రులు తీరిగ్గా, ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌చ్చి.. కేసీఆర్‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డం స్టార్ట్ చేశారు. ముందు స‌జ్జ‌ల స్మూత్‌గా మాట్లాడ‌గా.. తాజాగా మంత్రి పేర్ని నాని కాస్త మ‌సాలా ద‌ట్టించి విమ‌ర్శ‌లు చేశారు. ఇంత‌కీ వారేమ‌న్నారంటే..

ఏపీలో పార్టీ పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? ఎవరైనా రావొచ్చు.. ఎక్కడైనా పోటీ చేయొచ్చని సజ్జల సెల‌విచ్చారు. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే తెలంగాణకు మిగులు కరెంటు వచ్చిందని సజ్జల అన్నారు. లేటుగా అయినా లేటెస్ట్‌గా హాట్ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పేర్ని నాని. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా? అంటూ కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పథకాలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర మైక్ పెడితే బాగా చెప్తారని నాని ఎద్దేవా చేశారు. 

కొన్ని వారాల క్రితం నీళ్ల జ‌గ‌డంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఉన్న‌ట్టు సీన్ క్రియేట్ చేసి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల అటెన్ష‌న్‌ను డైవ‌ర్ట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యార‌ని.. అదే స్ట్రాట‌జీని మ‌రోసారి అమ‌లు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. కేసీఆర్ సోమ‌వారం ప్లీన‌రీలో ఈ కామెంట్లు చేస్తే.. గురువారం పేర్ని నాని కౌంట‌ర్ ఇవ్వ‌డం కావాల‌నే చేసిన‌ట్టుగా ఉందంటున్నారు. వాళ్లంతా ఒక‌టేన‌ని.. ఇదంతా డ్రామా అని అంతా అంటున్నారు. 

ఇక‌, మ‌ధ్య‌లో చంద్ర‌బాబు ఎపిసోడ్ మ‌రింత ఇంట్రెస్టింగ్‌. కేసీఆర్ ఇలా ఏపీలో క‌రెంట్ కోత‌లు, అప్పులు, బొగ్గు గురించి మాట్లాడ‌గానే.. అలా చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. కేసీఆర్ వ్యాఖ్య‌లు క‌రెక్ట్ అని.. సీఎం జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ఏపీకి ఇలా క‌రెంట్ క‌ష్టాలు, అప్పుల తిప్పలు దాపురించాయంటూ విమ‌ర్శించారు. అంత‌కుముందు సైతం.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో 36 గంట‌ల దీక్ష ముగింపు సంద‌ర్భంగా చంద్ర‌బాబు కేసీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి.. డ్ర‌గ్స్‌, గంజాయిని అరిక‌ట్టాలంటూ ఆదేశించార‌ని.. ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి మాత్రం డ్ర‌గ్స్‌, గంజాయిపై మీటింగ్ పెట్ట‌డానికి స‌మ‌యం కూడా లేదంటూ దుయ్య‌బ‌ట్టారు. ఇలా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు.. కేసీఆర్ కామెంట్ల‌ను బేస్ చేసుకొని.. స‌మ‌యానుకూలంగా జ‌గ‌న్‌ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తుండ‌టం వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. అందుకే ఉలికిప‌డిన‌ట్టు ఏపీ మంత్రులు వ‌రుస‌గా కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్లు ఇస్తూ రాజ‌కీయం ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా స‌జ్జ‌ల మ‌రో అడుగు ముందుకేసి.. కేసీఆర్ ఏదో మాట్లాడతారని.. చంద్రబాబు ఇంకేదో ఆరోపణలు చేస్తారని.. వారిద్దరి మధ్య ఏం అండర్ స్టాండింగ్ ఉందోనని.. ఆరోపిస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలా కేసీఆర్‌-వైసీపీ-చంద్ర‌బాబు ఎపిసోడ్‌ను రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు స‌రైన తీర్పు చెప్పనున్నారు.