జ‌న‌సేనానిపై మంత్రుల ఎదురుదాడి.. ప‌వ‌న్‌ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలేవి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. రిప‌బ్లిక్ వేదిక‌గా ప‌వ‌ర్‌స్టార్ ఏపీ పాల‌కుల‌పై విరుచుకుప‌డ‌టంతో ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. వ‌రుసబెట్టి మంత్రులు పీకేపై మాట‌ల తుపాకులు ఎక్కుబెట్టారు. పవన్ కళ్యాణ్ మమల్ని సన్యాసులు, చేత కానీ వాళ్ళు అన్నారు.. మరి ఆయన రుషి పుంగవుడా అంటూ ప్ర‌శ్నించారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘పవన్‌కల్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటే. ఆన్‌లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమా మంత్రి పేర్ని నాని ఓ రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందిపెట్టిందో పవన్ క‌ల్యాణ్ చెప్పాలంటూ నిల‌దీశారు. పవన్‌కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారని విమర్శించారు. టాక్స్‌లు, జీఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. పవన్ కల్యాణ్‌ ఇష్టానుసారం మాట్లాడితే తాట తీస్తామని మంత్రి పేర్నినాని హెచ్చరించారు. రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? అంటూ ప్రశ్నించారు. తాను సన్నాసి అయితే.. పవన్‌ సన్నాసిన్నర అని మండిపడ్డారు. ప్రభుత్వంపై పవన్‌ అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని.  ఇలా మంత్రుల ఎదురుదాడితో ఏపీలో సినిమా హీట్ తారాస్థాయికి చేరింది. అటు ఫిల్మ్ ఛాంబ‌ర్ మాత్రం త‌మ‌కు రెండు ప్ర‌భుత్వాల మ‌ద్ద‌తు కావాలంటూ మ‌ధ్యే మార్గంగా ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసి గోడ మీది పిల్లిలా వ్య‌వ‌హ‌రించింది.

ఇక‌, రిపబ్లిక్‌ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన ఇతర వ్యాఖ్యలను పక్కన పెట్టి,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని చేసిన వ్యాఖ్య విమర్శ విషయంలో మాత్రం రాజకీయ వర్గాలు విభిన్నంగా స్పందిస్తున్నాయి. మద్యం విక్రయాల విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే అకౌంటబులిటీ, పారదర్శకత అంటూ ప్రభుత్వ పెద్దలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ, చివరకు, మద్యం వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి ప్రభుత్వం అప్పులు చేసింది. రేపెప్పుడో వచ్చే ఆదాయాన్ని పూచికట్టుగా చూపింఛి జగన్ రెడ్డి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు అప్పుచేసింది. ఈ అప్పు తీరాలంటే కనీసం 25 ఏళ్ళు పడుతుందని విపక్షాలు అంటున్నాయి. అంతవరకు రాష్ట్ర ప్రజలు శక్తి కొలదీ మద్యం సేవించి సర్కార్ ఖజానా నింప వలసి వస్తుందని, అంటే, ప్రభుత్వం అంచెల వారీగా సంపూర్ణ మధ్యనిషేధం హామీని తుడిచేసిందనే అనుకోవలసి ఉంటుందని అంటున్నారు.  అలాగే, ఈ మధ్యనే జగన్ రెడ్డి ప్రభుత్వం మాంసం, చేపలు, రొయ్యల వ్యాపారంలోకి ఎంటర్ అయ్యింది.

ఈ పరంపరలో భాగంగానే, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయం వ్యాపారంలోకి ప్రభుత్వం ఎంటర్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే ఒక హీరోగా, సినిమా పరిశ్రమ వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా  పవన్ కళ్యాణ్ కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని అన్నారు. మద్యం విషయంలో ఒక ప్రిసీడెంట్ ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్’కు అయినా ఇంకొకరికి అయినా అలాంటి అనుమానాలు, విమర్శలు, వ్యాఖ్యలు రావడం సహజం.

అదిగాక, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. సంవత్సరానికి సరిపడా అప్పులను జగన్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలలోనే నాకేసింది. ఖజానా ఖాళీ అయిపొయింది, వంటి వార్తలు రోజూ వస్తూనే ఉన్నాయి. అభివృద్ధి అనే మాటను ఏపీ డిక్షనరీ నుంచి ఎప్పుడోనే నిష్క్రమించింది. జగన్ రెడ్డి ప్రభుత్వం తుడిచేసింది.  ఇప్పుడు సంక్షేమ పథకాలకు కూడా పైసా పైసా వెతుక్కునే పరిస్థితిలోకి ఆర్థిక పరిస్థితి జారుకుందని వార్త లొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ సర్కార్ తీరును ప్రశ్నించడం తప్పేలా అవుతుందని అంటున్నారు. అందుకే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడి చేయడం కంటే, ఆయన ప్రస్తావించిన అంశాలకు సమధానం ఇస్తే మంచిందని వైసీపీ నేతలు సైతం అంటున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News