మరో నీరో చక్రవర్తి ఫిడేలు రాగాలు...
posted on Nov 20, 2021 12:31PM
అన్నమంతా పట్టి చూడనవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో తెలిసి పోతుంది. అలాగే, వ్యక్తుల నైజం ఏమిటో, వారు ఎలాంటి వారో తెలుసు కోవడానికి కూడా లోతుల్లోకి వెళ్లి విశ్లేషణలు చేయనవసరం లేదు. ఈ సూత్రం, ఈ సత్యం, వ్యక్తులకే కాదు, పార్టీలకు కూడా వర్తిస్తుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మారు రుజువు చేసింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఆర్టిస్టులు ఎవరికీ కూడా, భాష విషయంలో ఎలాంటి పట్టిపులు లేవన్నది జగద్విదితం. మంత్రులు మొదలు అన్ని స్థాయిల్లో బూతులు మాట్లాడేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారా, అనిపించే విధంగా వైసీపీలో అన్ని స్థాయిల్లో బూతుగణాలు ఉన్నాయి.
అందుకు వైసీపీ సభ్యులు శుక్రవారం శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అవమానించి పొందిన ఆనందమే నిదర్శనం. అలాగే, రాష్ట్రానికే తలవంపులు తెచ్చిన ఆ సంఘటనపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, స్పందించిన తీరు ఇంకా దుర్మార్గంగా ఉందని సామాన్యులు సైతం, వీళ్ళా మా నాయకులు అని సిగ్గుతో తలలు వంచుకునున్న్తారు.ఛీ కొడుతున్నారు. నిజానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు సభ్యత, సంస్కారం గీతలను ఎప్పుడోనే దాటేశారు. కొద్ది రోజుల క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా, తెలుగునాట దిగజారుతున్న రాజకీయ విలువలు ముఖ్యంగా రాజకీయ నాయకులు వాడుతున్న అసభ్యకర భాష పట్ల అవేదన వ్యక్త పరిచారు. ఈ పరిస్థితి చూస్తుంటే, రాజకీయాలంటేనే విరక్తి కలుగు తోందని అన్నారు.
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి. అంతమాత్రాన ఓడిన వారిని చూసి అవహేళన చేయడం, అవమాన పరిచి ఆనందం పొందడం, అయితే రాక్షసత్వం,కాదంటే అజ్ఞానంతో కలిసిన అహంకారం, అనిపించుకుంటుంది. అయినా అధికార ప్రతిపక్ష సభ్యులు, ఒకరినొకరు విమర్శించుకోవచ్చును.కానీ,కుటుంబ సభ్యులను, అందులోనూ రాజకీయాలతో సంబంధమే లేని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాల్లో పరాకాష్టగా సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.
నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలోనూ చాలా సందర్భాలలో సభలో సభా మర్యాద తప్పారు. దేవుడిచ్చిన నోరును దుర్వినియోగం చేశారు.అందుకు తమకంటే ముందు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీనే తమకు ఆదర్శం అంటే, అందులో కొంత నిజం ఉంది. కాదనలేము, కానీ, రాను రాను రాజు గుర్రం గాడిద అవుతోంది, అన్నట్లుగా పరిస్థితి దిగజారడం పట్ల అటో మేథావులు, రాజకీయ నాయకులు ఇటు సామాన్యులు కూడా విచారం వ్యక్త పరుస్తున్నారు.
గతాన్ని పక్కన పెట్టి తాజా ఉదంతాన్నే తీసుకుంటే, అసెంబ్లీ సమావేశాల తోలి రోజున బీఏసీ సమావేసంలో ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల విజయ దురహంకారాన్ని ప్రదర్శించారు. కుప్పం ఎన్నికల ఫలితాలను కడుపులో పెట్టుకుని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబాబు సభకు వస్తే చూడాలని ఉందని, వ్యంగ్యంగా, అవహేళన చేశారు. అలాగే, సమావేశాలు ఎంత కాలం నిర్ణయించాలి అనే విషయంలోనూ అచ్చెం నాయుడు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి మరోమారు అదే రీతిలో అవహేళన చేశారు. అదేదో పిచ్చాపాటి ముచ్చట్లు అనంట్లుగా పెద్దాయన ముచ్చట పడుతున్నారు, 26 వరకు నిర్వహిద్దామని అన్నారు. అంటే, ముందుగానే సభలో ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుని అవమానించే ప్రణాళికతోనే ముఖ్యమంత్రి సభను 26 వరకు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారని వేరే చెప్పనక్కరలేదు.
ఓ వంక అకాల వర్షాలు , వరదలు రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తున్నాయి, మరో వంక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనావస్తకు చేరుకుంది....ఇలాంటి పరిస్థితిలో ... నీరో చక్రవర్తిలా జగన్ రెడ్డి ఈ ఫిడేలు రాగాలు ఏమిటని రాజకీయ విశ్లేషకులు కూడా విస్తుపోతున్నారు. ‘ఎదుటి వారి వేదనను చూసి నవ్వుకునే నీవు ఏడ్చే రోజు ఒకటి తప్పక వస్తుంద’ని, బైబిల్ చెప్పిదో లేదో కానీ, అది రుజువైన వాస్తవం. ఇదే చంద్రబాబును ఉద్దేశించి, గతంలో ఓ పెద్ద మనిషి, ఈ రోజు నువ్వు మీ అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకు వచ్చానా అని గుక్కపట్టి ఏడ్చేలా చేస్తాను, అని సభలోనే శపధం చేశారు. చివరకు ఆ శపధం చేసిన అయన ఏమయ్యారో అందరికీ తెలుసు ..అలాగే ఆరోజు ఆయన ఆ మాటలు అన్న రోజున చప్పట్లు కొట్టిన పార్టీ ఎక్కడుందో ఏమైందో కూడా తెలుసు .. అందుకే .. దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి అంటుంది బైబిల్ .. జగ రెడ్డికి ఇదైనా తెలిసే ఉండాలి . తెలుసో లేదో .