కోనసీమ చిచ్చు తెరవెనుక బాగోతం ఇదే! విధ్వంసం వెనుక ఉన్నది వైసీపీయే

ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఒక్కసారిగా చిచ్చు రేగడానికి తెరవెనుక బాగోతం బైటపడిపోయింది. జగన్ మార్క్ రాజకీయ వికృత స్వరూపం మరో సారి బట్టబయలైంది. రాష్ట్రంలో జిల్లాల పెంపునకు శ్రీకారం చుట్టినప్పుడే కోనసీమలో స్కెచ్ కు రూపకల్పన జరిగింది. అదీ తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే జరిగిందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇంతకీ ఆ తెరవెనక బాగోతం ఏమిటంటే..కోససీమలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉన్నాయి. వాటిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడే. రాజోలు మాత్రమే జనరల్ సీటు. అలాంటి కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడానికి ఎవరూ అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. అయితే జిల్లాకు కోనసీమ అనే పేరు ఉండాలన్నది మాత్రం కోనసీమ వాసుల దశాబ్దాల కల. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా కోసం దశాబ్దాలుగా అక్కడి ప్రజలు వినతులు చేస్తూనే ఉన్నారు. సరే వారి ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది.  

అయితే అది సజావుగా కాకుండా ప్రశాంతతకు మారు పేరైన కోనసీమ వాసుల మధ్య విద్వేషాలు రగిలేలా. కొత్త జిల్లాల ప్రతిపాదన వచ్చినప్పుడే కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న వినతులు వెల్లువెత్తాయి. అప్పుడే వాటిని పరిగణనలోనికి తీసుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అనే పేరు ఖరారు చేస్తే ఇప్పుడీ రచ్చ, చిచ్చు ఉండేది కాదని కోనసీమ సాధన సమితి నాయకులే అంటున్నారు. అలా కాకుండా కోనసీమ అనే పేరు ఖరారు చేసేసి.. నిర్ణయం తీసేసుకున్నాం ఇక మార్పు ఉండదని ప్రభుత్వ సలహాదారు, మంత్రులు ప్రకటనలు గుప్పించే.. ఆ తరువాత తీరిగ్గా దళిత సంఘాల నుంచి వినతులు అందాయంటూ మళ్లీ పేరు మార్పునకు నోటిఫికేషన్ జారీ చేశారు.

అక్కడి నుంచి కోనసీమ రగిలిపోయేందుకు జగన్ మార్కు రాజకీయం వేగంగా అడుగులు వేసింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ప్రశాంతంగా సాగుతుంటే.. ఓ వ్యక్తి కలెక్టరేట్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి ఉద్రిక్తలు పెచ్చరిల్లడానికి కారణమయ్యాడు.  ఆ వ్యక్తి పేరు అన్యం సాయి. అమలాపురం పట్టణానికి చెందిన అన్యం సాయి వైకాపాలో చురుకైన కార్యకర్త.  మంత్రి పిపిపే విశ్వరూప్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వ్యక్తి. అలాగే వైకాపా అధినేత జగన్ జన్మదిన వేడుకలను అమలాపురంలో ఘనంగా నిర్వహించాడు. వైకాపా ప్రతి కార్యక్రమాన్ని భుజాన వేసుకుని ముందుండి నిర్వహించే అన్యం సాయి.. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి ముఖ్యులు జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం ఇస్తున్న సమయంలో ఆ కలెక్టరేట్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేసి ఉద్రిక్తతలు పెచ్చరిల్లేందుకు కారకుడయ్యారు.

అదీ సంగతి.. కోనసీమ జిల్లా పేరు మార్పునకు నోటిఫికేషన్ జారీ చేసింది వైసీపీ సర్కార్.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రశాంతంగా సాగుతున్న ఆందోళనలను పక్కదారి పట్టి ఉద్రిక్తతలు పెచ్చరిల్లడానికి కారకుడయ్యాడు. ఇక ఆ తరువాత జరిగిందంతా విధ్వంసమే. తాడేపల్లి ప్యాలస్ ఆదేశాలకు అనుగుణంగా.. చలో అమలాపురం కార్యక్రమంలో విధ్వంసం చెలరేగడానికి అనువుగా పోలీసులు తమ వంతు పాత్ర పోషించారు. శాంతి భద్రతల పరిరక్షణను గాలికి వదిలేసి మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబ సభ్యులకు నివాసం ఖాలీ చేయమని సూచనలు ఇచ్చారంటేనే ఆయన నివాసంపై దాడి జరుగుతుందన్న సంగతి వారికి ముందే తెలుసునన్న సంగతి అవగతమౌతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.