అమలాపురం.. నో ఎంట్రీ.. నో ఎగ్జిట్

బుధవారం అంతా విధ్వంసపు మంటల్లో అట్టుడికిన అమలాపురంలో గురువారం స్మశాన వైరాగ్యం తాండవిస్తోంది. అమలాపురానికి వచ్చే బస్సు సర్వీసులన్నిటినీ నిలిపివేయడంతో పాటు అమలాపురం నుంచి వెళ్లే బస్సులను కూడా ఆర్టీసీ డిపీలకే పరిమితం చేసింది. దీంతో అమలాపురం పరిస్థితి ఇప్పుడు నో ఎంట్రీ.. నో ఎగ్జిట్ గా మారిపోయింది. కోనసీమ జిల్లా పేరు మార్పునకు వ్యతిరేకంగా కోససీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఛలో అమలాపురం కార్యక్రమం హింసాత్మకంగా మరిన నేపథ్యంలో పోలీసులు   గురువారం భారీగా మోహరించారు.

అమలాపురంలోనికి వచ్చే దారులన్నిటినీ మూసేశారు. బయట నుంచి ఎవరూ కూడా పట్టణంలోనికి వచ్చేందుకు అనుమతించడంలేదు. అలాగే పట్టణం నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయడం లేదు. కోనసీమ జల్లా సాధన సమితి గురువారం కోనసీమ ముఖద్వారం రావుల పాలెంలో నిరసన కార్యక్రమానికి పిలుపు నివ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రావుల పాలెంలో కూడా భారీగా మోహరించారు. ఇక అమలాపురంలో సెల్ ఫోన్ సిగ్నల్లను నిన్నటి నుంచీ నిలిపివేశారు. అమలాపురం నుంచి బయటకు, బయటనుంచి అమలాపురంలోకి ఎలాంటి సమాచారం రాకుండా, వెళ్లకుండా నియంత్రించారు.

దీనివల్ల కోససీమ సాధన సమితి గురువారం చేపట్టిన నిరసన ప్రదర్శనకు ఇక్కడ నుంచి ఇన్ పుట్స్ వెళ్లే అవకాశం ఉండదన్నది పోలీసు వ్యూహంగా చెబుతున్నారు.  ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని అమలాపురంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కర్ఫ్యూ విధించకున్నా పట్టణంలో కర్ఫ్యూ వాతావరణమే నెలకొని ఉంది.  చాలా వరకూ దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.