యాదాద్రి అభివృద్ధి కోసం కేసీఆర్ 'రియల్' ప్లానింగ్!
posted on Sep 6, 2016 12:29PM

పుణ్య క్షేత్రాలంటే భక్తికి నిలయాలు! అక్కడికి వెళితే కోరికలు తీరతాయి. ప్రశాంతత లభిస్తుంది! కాని, ఇదంతా నాణానికి ఒక వైపు! ఇంకో వైపు తాజా పరిణామం! పుణ్యక్షేత్రాలు రియల్ ఎస్టేట్ బూమ్ కు కారణం అవుతున్నాయి! అందుకు మంచి ఉదాహరణ తెలంగాణ తిరుపతి వంటి యాదాద్రి!
తెలంగాణ జనం యాదగిరి గుట్ట అని పిలుచుకునే నరసింహ క్షేత్రం ఇప్పుడు యాదాద్రి అయింది! మారింది కేవలం పేరు మాత్రమే కాదు. యాదగిరి గుట్ట మొత్తం స్వరూపమే మారిపోయింది. ఇంకా మారిపోనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ ఫలితంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. త్వరలో ఉప్పల్ నుంచి యాదగిరి గుట్టకు ఎంఎంటీస్ కూడా రానుంది. అదే జరిగితే యాదగిరి నరసింహుడ్ని దర్శించుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది!
యాదాద్రి అభివృద్ధి ఒకవైపు ఆధ్యాత్మిక కోణంలో వున్నా మరో వైపు భీభత్సమైన ఆర్దిక కోణం కూడా కలిగి వుంది! నిజానికి హైద్రాబాద్ కు కొద్దిగా దూరంగానే వున్న యాదగిరి గుట్ట ప్రాంతం నిన్న మొన్నటి వరకూ ఎవ్వరూ పెద్గగా పట్టించుకున్నది కాదు. కాని, క్రమంగా యాదాద్రి అభివృద్ధి బాటలో పయనిస్తుండటంతో రియల్ బూమ్ మొదలైంది. మరీ ముఖ్యంగా త్వరలో 850ఎకరాల్లో టెంపుల్ సిటీ డెవలప్ చేస్తామని సీఎం ప్రకటించటంతో భూముల రేట్లు కళకళలాడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది! అర్జెంట్ గా 250ఎకరాల్లో కాటేజీలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్ట్ లు, పార్కింగ్ స్థలాలు, ఇన్ ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ వచ్చేస్తే యాదాద్రి 'రియల్' డెవలప్ మెంట్ ఊపందుకున్నట్టే!