T20 ఫైనల్స్‌లోకి- వెస్టిండీస్ మహిళల జట్టు కూడా!

 

వెస్టిండీస్‌కు నిన్నటి రోజు బాగా కలిసివచ్చినట్లుంది. ఇటు మహిళల జట్టు, అటు పురుషుల జట్టు కూడా, టి20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లోకి దూసుకుపోయాయి. 2009 నుంచి మహిళలకు కూడా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకూ విండీస్‌ మహిళలు పేలవంగానే ఆడుతూ వచ్చారు. కానీ ఈసారి తాము కూడా పురుషుల జట్టుకు ఏమాత్రం తీసిపోమంటూ సత్తా చాటుతున్నారు. నిన్న కూడా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు. నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 143 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిలిపింది.

 

ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో న్యూజిలాండ్ ఆది నుంచి తడబడుతూనే ఉంది. చివరికి 8 వికెట్లను కోల్పోయి 137 పరుగుల వద్ద చేతులెత్తేసింది న్యూజిలాండ్‌. ఇక ఆదివారం నాడు జరగనున్న ఫైనల్స్‌లో వెస్టిండీస్‌ మహిళల జట్టు, ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత మూడు సందర్భాల నుంచి టి20 మహిళల కప్‌ను చేజిక్కించుకుంటున్న ఆస్ట్రేలియా తన రికార్డుని పదిలంగా ఉంచుకుంటుందో... దూకుడు మీద ఉన్న వెస్టిండీస్‌ ముందు తలవంచుతుందో చూడాలి! ప్రస్తుతానికైతే ఒకేరోజు అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టు కీలక విజయాన్ని సాధించడం, వెస్టిండీస్‌ క్రికెట్ చరిత్రలో ఓ సుదినం అంటూ అక్కడి క్రీడాశాఖ మంత్రి గ్రాంజ్ తెగ పొగిడేశారు.