బీహార్లో మద్యనిషేధం... భారీగా తాగిన జనం

 

బీహార్లో నేటి నుంచి దేశవాళీ మద్యాన్ని అమ్మరాదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యనిషేధాన్ని విధించింది. దీంతో ఇప్పటివరకూ పేరుకుపోయిన సదరు సరుకును వదిలించుకునేందుకు, అక్కడి మద్యం షాపులు భారీ రాయితీలతో మద్యాన్ని అమ్మివేశాయి. సారాయి పొట్లాలనైతే మరీ వక్కపొడి అమ్మినట్లు అమ్మేశారు వ్యాపారస్తులు. ఈ రాయితీని అందిపుచ్చుకున్న జనం నిన్న ఒక్కరోజే విచ్చలవిడిగా మద్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. నేటి నుంచి మద్య నిషేదం అమలులోకి రావడంతో చివరిసారిగా మద్యాన్ని తాగుదామని కొందరు, ఇంట్లో దాచుకునేందుకు కొందరు విపరీతంగా కొనుగోళ్లు చేశారట. మరోవైపు దేశవాళీ సరుకుని నిషేధించి, విదేశీ మద్యాన్ని మాత్రమే అనుమతించడంపై నితీశ్ ప్రభుత్వం మీద విమర్శలు చెలరేగుతున్నాయి.

 

ఈ మద్యనిషేధం పేదవారికి మాత్రమే కానీ, ధనికులకు కాదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల పేదవారు మరింత ఖర్చు చేసి మద్యాన్ని కొనుగోలు చేస్తాడని, లేదా కల్తీ సారాయి తాగి అనారోగ్యం పాలవుతాడనీ అభిప్రాయపడుతున్నారు. కానీ నితీశ్‌ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. విదేశీ మద్యాన్ని కూడా ఎక్కువ రోజులు అనుమతించబోమని, దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. నితీశ్‌ సంకల్పం అయిత బాగానే ఉంది. అది సక్రమంగా అమలు జరగాలన్నదే దేశం కోరిక! అదే కదా అసలు సమస్య!