ఎ టు జడ్.. మగువలే బెస్ట్




ఆడవాళ్ళూ మగవాళ్ళతో సమానంగా ఎదిగారని పోలుస్తుంటారు , కానీ నిజానికి ఆ పోలిక ఇటునుంచి అటు చేయాలి, అంటే ఆడవారిలా మగవారు కూడా అని పోలిస్తే బావుంటుంది. ఎందుకంటే, ఎన్నో విషయాలలో ఆడవారు మగవారికన్నా ఎంతో  మెరుగని గట్టిగా చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు. అవేంటో తెలుసా?

ఒత్తిడిని తట్టుకునే శక్తి ఎక్కువే

నిర్మాణాత్మకంగా ఆలోచించే శక్తి స్త్రీలకే ఎక్కువట.  ఒక సమస్యకి చిగురుటాకులా ఒణికినా,  కన్నీరు ఆగగానే ఆలోచనలకి పదునుపెట్టగలరు. ఆ సమస్యకి దారులు వెతకగలరు. ఒత్తిడి సమయాలలో కూడా చురుకుగా అలోచించి సరి ఆయన నిర్ణయం తీసుకోగలరు. దీనివెనక వున్న సైన్సు తెలిస్తే మీరు కూడా ఒప్పుకుంటారు  ఈ విషయాన్నీ.  మనలో వుండే మూడు హార్మోన్లు ఆడ,మగ ఒత్తిడికి ప్రతిస్పందించే తీరుని నిర్ణయిస్తాయి. అవే cortisol, epinephrine, అలాగే oxytocin. ఒత్తిడి కలగగానే మొదటి రెండు హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ సమయంలో మూడో హార్మోన్ మెదడు సందేశాలను గమనించి ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది . అయతే ఆ హార్మోను ఆడవారిలో కన్నా మగవారిలో తక్కువ. అందుకే ఒత్తిడిని మగవారికన్నా ఆడవారు సమర్థవంతంగా ఎదుర్కోగలరని  చెబుతున్నారు నిపుణులు. ఆడవారికి  ప్రకృతి ప్రసాదించిన మరో వరం ఈస్ట్రోజెన్ హార్మోన్. ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషించే హార్మోన్ అది.  ఇలా ఎలా చూసినా ఒత్తిడిని తిప్పికొట్టటంలో ఆడవారే బెటర్.

బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్

ఇంటికి సంబంధించి ఆడవారే బెస్ట్ ఫైనాన్సు మేనేజర్స్ అంటున్నారు అధ్యయనకర్తలు. మామూలు పరిస్థితులలో పెద్దగా పట్టించుకోకపోయినా, ఒక బాధ్యతగా అప్పగిస్తే మాత్రం అద్భుతంగా ఆర్థిక నిర్వహణ చేయగలరు ఆడవారు. అందుకు చదువు, ఉద్యోగం లాంటివి కూడా అక్కరలేదుట. వారి పరిధిలో వారు డబ్బును పొదుపు చేయటం, ఖర్చులు అదుపులో వుంచటం వంటివి సమర్థవంతంగా చేస్తారని చెబుతున్నారు వారు. గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసి స్టడీలో తెల్సిన కొన్ని అంశాలు ఎప్పటినుంచో ఆడవారికి ఆర్థికనిర్వహణ చేతకాదని వున్న  అపవాదుని తొలగించాయి.  అమెరికా వంటి దేశాలలో 47 శాతం మంది ఆడవారు ఒంటరిగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకున్న వారు పిల్లల భవిష్యత్‌కి కావాల్సిన ఆర్థిక వనరులని సమకూర్చుకోవటంలో, వాటిని నిర్వహించటంలో చూపించే నైపుణ్యం మెచ్చుకోతగ్గది అంటున్నారు నిపుణులు.

ఇక వీరు చూపిస్తున్న మరో ఉదాహరణ, ఫార్చ్యూన్ 500 జాబితానే తీసుకుంటే మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల  కన్నా, మహిళా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లే ఎక్కువ. ఇందులో మొదటి తొమ్మిది మంది 681 బిలియన్ల డాలర్ల సంపదని తమ చేతుల్లో ఉంచుకున్నారు.  అతిగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించక పోవటం, వాస్తవిక అంశాలకు అనుగుణంగా స్పందించటం  ఆడవారి బలాలుట. అలాగే పెట్టుబడులు పెట్టాల్సివచ్చినప్పుడు చాలా తెలివిగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సమీక్ష ప్రకారం వ్యాపార రంగంలో ఉన్న మహిళలు సగటున 20 శాతం లాభాలతో ముందంజలో ఉన్నారు.


మల్టీటాస్కింగ్‌లో టాప్

అటు పిల్లలు, ఇటు ఇల్లు, ఇంకో పక్క ఆఫీస్, తోడు పెట్టాల్సిన పాలు, కట్టాల్సిన బిల్స్ , బ్యాంకులో వేయాల్సిన చెక్, ఆఫీస్‌లో అటెండ్ అవాల్సిన మీటింగ్, ఇలా ప్రతిరోజూ ఆడవారు చేసే  మల్టీటాస్కింగ్ చూసి కూడా చాలాసార్లు 'నీకేం చేతకాదు'  అనే మగవారిని ‘‘ పొరపాటున కూడా ఆ మాట అనకండి . మీకంటే అన్నిటినీ ఒకేసారి చక్కబెట్టడంలో ఆడవారే బెటర్’’ అంటున్నారు గ్లాస్గో యూనివర్సిటీ వారు. మగవారు ఒకపని నుంచి ఇంకో పనికి వెళ్ళటానికి సమయం తీసుకుంటే , ఆడవారు అవే పనులని ఒకేసారి చేయగలరని తెలిసింది వీరి అధ్యయనంలో. ఆడవారిలోని ఈ శక్తే వారిని విజేతలుగా నిలబెడుతుందని కూడా అంటున్నారు వీరు. అలాగే అమ్మ అయ్యాక ఆ శక్తి ఇంకా పెరగటాన్ని కూడా గుర్తించారు.  ఎంతైనా పది చేతులు వుండే ఆది పరాశక్తికి ప్రతిరూపాలం మనం... ఏమంటారు?

IQ లో కూడా ఫస్ట్

University of Pennsylvania వారి ప్రకారం మగవారికన్నా ఆడవారి IQ లెవెల్స్ ఎక్కువ. ఆడవారి మెదడులోని  orange  inter-hemisphere links  అందుకు కారణం అట . ఒకప్పటి కంటే ఇప్పుడు ఆడవారి ఐక్యు లెవెల్స్ పెరిగాయా  లేక ఒకప్పుడు వున్నా గుర్తించలేదా అన్న విషయం మీద పరిశోధనలు చేస్తున్నారు ఇంకా.  ఆ విషయం తేలేదాకా,  ఇప్పటికి అయితే ఈతరం ఆడవారు మగవారి కన్నా తెలివైన వారు. చదువులో, ఆటల్లో, ప్రయోగాలలో అన్నిటిలో ఇప్పటి తరం అమ్మాయిలు కూడా మగపిల్లల్ని దాటేస్తూన్నారుట.

ఇలా ఎటు చూసినా మనకి జేజేలు పలుకుతున్నాయి అధ్యయనాలు. అందుకే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


-రమ