వైసీపీ బీజేపీ బంధం తెగిపోతుందా?

ఏపీలో బీజేపీ వైసీపీ సంబంధాలు ఇప్పటి వరకూ ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క అన్నట్లుగా మారిపోబోతున్నాయా?  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణుల దాడిపై కమలం పార్టీ అధ్యక్షుడు నడ్డా తీవ్రంగా స్పందించడాన్ని బట్టి చూస్తే ఔననే సమాధానమే పరిశీలకుల నుంచి వస్తోంది. అమరావతి రైతులకు మద్దతు పలికిన బీజేపీ జాతీయ కార్యదర్శిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడాన్ని  బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించిన తీరు తేటతెల్లం చేస్తోందిఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు జెపి నడ్డా దాడికి గురైన జాతీయ కార్యదర్శి సత్యకు ఫోన్ చేసి, దాడి వివరాలు తెలుసుకున్నారు..

ఆ సందర్భంలో సత్యకుమార్ ఇచ్చిన వివరణ విన్న నడ్డా వైసీపీ అగ్రనాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఏ అమరావతి అంశంపై అయితే సత్యకుమార్‌పై దాడి జరిగిందో, అదే అమరావతి అంశంపై వెనక్కి తగ్గకుండా, ముందుకు వెళ్లాలని నడ్డా ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నాయకత్వాన్ని ఆదేశించారని చెబుతున్నారు.  అలాగే రాష్ట్రంలో వైసీపీ పాలనా వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ఏపీ బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

అమరావతి రైతుల పోరాటానికి  సంఘీభావం ప్రకటించి తిరిగి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై  వైసీపీ కార్యకర్తలు శుక్రవారం జరిపిన దాడిని బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.  బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఆయన కారును ధ్వంసం చేయడంతో పాటు,   బీజేపీ కి చెందిన దళిత, బీసీ నేతలపై దాడికి పాల్పడడానికి సంబంధించిన  వీడియోలను ఇక్కడి నేతలు ఢిల్లీ నాయకత్వానికి పంపించారు.   టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని  పవన్ కల్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు తదితరులు సత్యకుమార్‌పై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఉన్న సత్యకుమార్ కు స్వయంగా ఫోన్ చేసి దాడి వివరాలను తెలుసుకున్నారు.  పోలీసుల సమక్షంలోనే తమపై దాడి జరిగిందని, తమను ముందుకు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు.. వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేస్తుంటే  ప్రేక్షకపాత్ర పోషించారని  ఆయన నడ్డాకు వివరించారు.

తమతో పాటు ఉన్న కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిన దాడిగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.  వైసీపీ ఎంపీ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని సత్యకుమార్ నడ్డాకు వివరించినట్లు పార్టీ శ్రేణులు చెప్పాయి.  దీంతో నడ్డా ఈ దాడిని తాము చాలా సీరియస్ గా తీసుకుంటామని, మీకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని సత్యకుమార్ కు చెప్పారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదనీ,  పార్టీ నేతలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని నడ్డా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.  పార్టీ లైన్‌లో దూకుడుగా ముందుకు సాగాలని చెప్పారని, అమరావతి రైతులకు మద్దతునిచ్చిన క్రమంలోనే ఇదంతా జరిగినందున… అదే అమరావతి అంశంపై, ఇక నుంచి సీరియస్‌గా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు పార్టీ శ్రేణుల సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వంపై పోరాటాన్ని సీరియస్‌గా ముందుకు తీసుకువెళ్లాలని నడ్డా ఆదేశించారు. ఆ తరువాత నడ్డా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా ఫోన్ చేశారు.  దాడిపై పార్టీ రాష్ట్ర శాఖ   తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరారు. దాడిని   ఖండించామని వీర్రాజు  ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఆయన  శనివారం ( ఏప్రిల్1)  రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.  దీంతో సోము వీర్రాజు ఆఘమేఘాల మీద పార్టీ జిల్లా నేతలతో   టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటుచేసి శనివారం ( ఏప్రిల్ 1) రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

అదలా ఉండగా మరోవైపు జాతీయ కార్పొరేషన్ చైర్మన్ జయప్రకాష్ ఆధ్వర్యంలో.. బీజేపీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీని కలిసి, జరిగిన దాడిపై నిరసన వ్యక్తం చేశారు. సత్యకుమార్ వాహనాన్ని ధ్వంసం చేసి, దాడి చేసిన వారిని శిక్షించడంతోపాటు, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపిస్తూ వినతిపత్రం సమర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu