ఒక అల్లు అర్జున్.. మహేష్ బాబు.. వైసీపీ ఈ హీరోలను ఎందుకు ఓన్ చేసుకుంటోంది?
posted on May 31, 2025 3:25PM

ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. దీంతో మహేష్ బాబును ఓన్ చేసుకుంటూ ధూమ్ ధామ్ చేసేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. గతంలో అల్లు అర్జున్ నంద్యాలకు రావడం నుంచి మొదలైంది అల్లు అర్జున్ మీద విపరీతమైన ప్రేమాభిమానం. అక్కడి నుంచి వైసీపీ కేడర్ అల్లు అర్జున్ ని పట్టుకుని ఊగిపోవడం మొదలైంది. అంతెందుకు లైలాను అదే పనిగా బ్యాన్ చేసి దాన్ని ఆడకుండా చేసింది ఇదే వైసీపీ కేడర్. కారణం.. ఈ సినిమాలో నటించిన పృధ్వి చేసిన లెవన్ కామెంట్లు. ఇలా సినిమాలను ఎట్టి పరిస్తితుల్లో లైట్ తీస్కోవడం లేదు వైసీపీ. అల్లు అర్జున్ బ్లడ్ గ్రూప్ లో జనసేన ఉంది. ఆ కాంపౌండ్ మొత్తం జన సైనికులే. కానీ అది గతం. అర్జున్ భార్య కులాన్ని అడ్డు పెట్టుకుని బంధుత్వం కలిపేసుకున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు.
ఇప్పుడు అల్లు అర్జున్ స్వతహాగా ఎలాంటి రాజకీయ విధానం కలిగి ఉన్నారో ఏమో తెలీదు. కానీ.. వైసీపీ వాళ్లు మాత్రం.. అల్లు అర్జున్ మా హీరో అని ఓన్ చేసుకుంటున్నారు. ఆయన ప్రతి కదలికకూ కొమ్ము కాస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వెన్నంటే ఉన్నారు. అల్లు అర్జున్ భుజాలను అడ్డు పెట్టుకుని.. పవన్ కళ్యాన్ ని గానీ ఆయన జనసైనికులను గానీ కొడితే అలా పడి ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు.
ఇక మహేష్ బాబు సంగతి సరే సరి. సూపర్ స్టార్ కృష్ణ ఆనాడే ఎన్టీఆర్ ని వ్యతిరేకించిన వ్యక్తి. యాంటీ ఎన్టీఆర్ మూవీస్ సైతం తీసిన వారు. అంతేనా.. కాంగ్రెస్ నుంచి ఎంపీగానూ గెలిచిచారు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ వారసుడైన మహేష్ బాబు సైతం వారికి ఆరాధనీయుడే. దీంతో కృష్ణను ఆయన కొడుకు మహేష్ ను తమ కుటుంబ హీరోగానే ఫీలవుతుంది తల్లి కాంగ్రెస్. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ దాన్ని కొనసాగిస్తోందని అంటారు.
ఇంతకీ జగన్ ఫేవరేట్ హీరో ఎవరంటే బాలయ్య. బాలకృష్ణ అంటే జగన్ కి ఎడతెగని వీరాభిమానం. కడప జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు.. ఒక సమయంలో బాలయ్య సినిమాలను సైతం డిస్ట్రిబ్యూటర్ గా విడుదల చేసేవాడని అంటారు. ఇదే బాలకృష్నను ఒక సమయంలో కాపాడినట్టుగానూ చెబుతారు. ఇక జగన్ సోదరి షర్మిల, యోగి అనే సినిమా ప్రొడ్యూసర్ కూడా.
జగన్ కుటుంబం కూడా సినిమాలతో లింక్ అప్ అయ్యి రకరకాల యత్నాలు చేశారు. కానీ అదెందుకో వర్కవుట్ కాలేదు. సినిమాల పరంగా వారు ఏమి చేయదలిచినా ఎదురు దెబ్బలు తగిలేవి. జగన్ డిస్ట్రిబ్యూటర్ గా కావచ్చు, షర్మిల ప్రొడ్యూసర్ గా కావచ్చు.. రివర్స్ లో నష్టాలు లేదా చెడ్డపేరే మిగిల్చాయి. అయినా సరే వైసీపీ అభిమానులు.. మనకంటూ ఒక హీరో ఉండాలన్న కోణంలో గతంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ని ఓన్ చేసుకుంటూ.. ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.