పీఎస్సార్ ఆంజనేయులుకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో  విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి‌ పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 31) అస్వస్థతతకు గురయ్యారు. విజయవాడ జిల్లా  జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ ప్లక్చుయేషన్స్ రావడంతో జైలు అధికారులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి ప్రత్యేక వార్డులో పీఎస్సార్ ఆంజనేయులుకు చికిత్స అందిస్తున్నారు.  సాయంత్రం వరకు వైద్యుల పరిశీలనలో ఉంచి  అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం.

పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో  ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో  హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు. 

అదలా ఉంటే   నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీసీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీకి అనారోగ్య కారణాలతో ఆయన విజ్ణప్తి మేరకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు వంశీని  విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu