వెండి తెర మీదేనా మీ హీరోయిజం.. వరద బాధితులకు ఉండదా మీ సాయం! 

సోనూసూద్.. విలన్‌గా తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో వదల బొమ్మాళి వదలా... అంటూ తన నట విశ్వరూపంతో చెలరేగిపోయాడు. కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బంధించిన నాటి నుంచి.. నేటి వరకు.. ఆపదలో ఉన్నవారికి నేను సైతం అంటూ.. ఆపన్న హస్తం అందిస్తున్నారీ సోనూసూద్. 

ఇటీవల చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. దీంతో ఆయా జిల్లాల్లో పలు కాలనీలు నీట మునిగగా, వరదలతో పలు కాలనీలకు కాలనీలు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా లేక, అన్నం పెట్టే నాధుడు లేక, సాయం, సహాయం అందించేవారు లేక ప్రజలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు వస్తు సామాగ్రితోపాటు నిత్యవసర వస్తువుల కిట్ బ్యాగ్‌లను అందజేయాలని ఆయన స్పంకల్పించారు. ఆ క్రమంలో వాటిని ఆయన నెల్లూరు జిల్లాకు పంపారు. వాటిని బాధితులకు అందించేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ వైపు సోనూసూద్ వరద బాధితులకు సాయంపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు టాలీవుడ్ హీరోలోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే.. ఆషా మాషీ కాదని.. రెన్యూమరేషన్, విదేశాల్లో షూటింగ్ స్పాట్లు.. ఫైటింగులు, ఛేజింగులు.. ఇలా అన్నింటిలో బాలీవుడ్‌ ఇండస్ట్రీతో పోటా పోటీ ఇస్తుందీ మన టాలీవుడ్. మరీ అలాంటి ఇండస్ట్రీలో ఉన్న హీరోలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న.. చోటు చేసుకోంటున్న విపత్తులకు వీసమెత్తు సాయం కూడా ఎందుకు చేయడం లేదని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో సదరు హీరోలు.. తమ సినిమాల్లో కంటి చూపుతో రైళ్లను ఆపగలరు, తొడకొట్టి గాల్లోకి సూమోలు లేపగలరు, తమ డైలాగ్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలరు, ఇక డ్యాన్స్‌లు, ఫైటింగ్స్‌ వస్తే మాత్రం సదరు హీరోల ఫ్యాన్స్‌లకు పూనకాలే పునకాలు. ఇక టాలీవుడ్ హీరోలు చేసే విన్యాసాలకు కరెన్సీ కాగితాలు, రూపాయి నాణెలు, పూల దండలు వెండి తెరపై వర్షమై పడుతోంటుంది. 

టాలీవుడ్ హీరోలు తీసుకునే రెన్యూమరేషన్ ఏమైనా తక్కువా అంటే అదీ కాదు. అంతా కోట్ల రూపాయిల్లోనే వ్యాపారం. ఇటు సినిమాలే కాకుండా అటు యాడ్స్‌లో సైతం నటిస్తూ.. సినిమాలతో సమానంగా యాడ్స్‌ ద్వారా  పైసా తక్కువ కాకుండా సంపాదిస్తున్నారీ ఈ హీరోలు. ఈ హీరోల కళా పోషణ సైతం వెండి తెరపైనే కాదు బుల్లి తెరపైన మనం కళ్లు అప్పగించి మరీ చూస్తున్నాం. మరి వీరికీ ఎంత సేపు తమ కులం, తమ ప్రాంతం, తమ వాళ్లు, తమ వారసత్వం అని పాకులాడే సదరు జీరోలు సారీ ఈ హీరోలకు ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్న వేళ సాయం చేయాలనే తలంపు మనస్సులో ఎందుకు మెదలదని తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కానీ ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్న సమయంలో.. బాధితుల బాధ అరణ్య రోదన అవుతున్న వేళ.. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వాలు.. ఆర్థిక సహాయం చేసే స్తోమత లేక.. తూర్పు తిరిగి దణ్ణం పెట్టే వేళ.. సోనూసూదు లాంటి వాళ్లు.. దైవం మానుష రూపేణ సహాయం అందిస్తారన్నది మాత్రం సుస్పష్టం. అయితే కనీసం స్పందించడం జీవ లక్షణం.. ప్రతి స్పందించడం మనిషి లక్షణం. కానీ మానవత్వం చాటుకునే వేళ ప్రతి స్పందించాల్సిన సదరు సోకాల్డ్ ఈ టాలీవుడ్ హీరోలు ఆ పని చేయకుండా స్తబ్దతగా ఉండిపోతున్నారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టే మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడు.. నూటికో కోటికో.. ఒక్కడే ఒక్కడు.. అని మహాకవి డాక్టర్ అందేశ్రీ ఈ పాటను రాసి ఉంటారు.