కేంద్రం ర‌ద్దు చేసిన చ‌ట్టాల్లో ఏముంది? రైతుల పోరాటమెందుకు? గెలుపెవరది?

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గింది. మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గురు నానక్ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో ఏడాదిగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించినట్లైంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం ఓడిపోయిందంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ మాత్రం తమది రైతుల పక్షపాత ప్రభుత్వమని చెబుతోంది.  ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముంది, ఆ చట్టాలతో రైతులు నష్టం కలుగుతుందా.. రైతులు ఎందుకు అంతలా ఆ చట్టాలను వ్యతిరేకించారు అన్న దానిపై సమగ్రంగా చూద్దాం..

రైతుల మేలు కోస‌మేన‌ని చెబుతూ మోదీ ప్ర‌భుత్వం గ‌త ఏడాది మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకొచ్చింది. రైతులకు లాభం చేకూర్చేందుకే ఈ చ‌ట్టాల‌ను తెచ్చామని కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థించుకున్న‌ప్ప‌టికీ.. రైతులు మాత్రం ఈ చ‌ట్టాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. వీటి వ‌ల్ల లాభాల కంటే న‌ష్టాలే ఎక్కువగా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. వెంట‌నే కొత్త సాగు చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో రైతులు రోడ్డెక్కి ధ‌ర్నాలు చేశారు. సాగు చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ కోసం ఇప్ప‌టికీ దేశ రాజ‌ధాని వ‌ద్ద రైతులు దీక్ష‌లు చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు కేంద్రం త‌లొగ్గింది. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు. దీంతో రైత‌న్న‌లు సంబురాల్లో మునిగిపోయారు. మరి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఏంటి? వాటిని అన్న‌దాత‌లు ఎందుకు అంత‌లా వ్య‌తిరేకించారు? ఒక‌సారి చూద్దాం..

నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల (స‌వ‌ర‌ణ ) బిల్లు – 2020
వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వ‌ర్త‌క‌, వాణిజ్యం ( ప్రోత్సాహం, స‌దుపాయ క‌ల్ప‌న )బిల్లు -2020
ధ‌ర‌ల హామీ, వ్య‌వ‌సాయ సేవ‌ల ఒప్పంద బిల్లు ( సాధికార‌త, ర‌క్ష‌ణ ) -2020

చ‌ట్టాల్లో ఏముంది?

నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల (స‌వ‌ర‌ణ ) బిల్లు

దేశంలో ప్ర‌స్తుతం నిత్య‌వ‌స‌ర స‌రుకుల చ‌ట్టం-1955 అమ‌లులో ఉంది. దీనికి స‌వ‌ర‌ణ‌గా కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. నిత్య‌వ‌స‌ర స‌రుకుల జాబితాలో ఉన్న వ‌స్తువుల ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణ అధికారం కేంద్రానికి ఉంటుంది. వ్య‌వ‌సాయరంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచ‌డానికి ఉద్దేశించిన చ‌ట్టంగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతూనే నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌పై నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ను స‌ర‌ళీక‌రించ‌డం ఈ చ‌ట్టం ఉద్దేశ‌మ‌ని చెప్పారు. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్ప‌త్తులు వంటి స‌రుకుల‌ను నిత్య‌వ‌స‌రాలుగా పేర్కొన‌డానికి కేంద్ర ప్ర‌భుత్వానికి ఈ చ‌ట్టం అధికారం ఇస్తుంది. అంటే యుద్ధం వ‌చ్చిన‌ప్పుడు, ప్ర‌కృతి విప‌త్తులు త‌లెత్తిన‌ప్పుడు, ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిన‌ప్పుడు లాంటి అసాధార‌ణ ప‌రిస్థితులు త‌లెత్తిన‌ప్పుడు నిత్య‌వ‌స‌రాల ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ, వాణిజ్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం నియంత్రించ‌గ‌ల‌దు. ఈ కొత్త సాగు చ‌ట్టం ప్ర‌కారం తృణ ధాన్యాలు, ప‌ప్పులు, ఆలుగ‌డ్డ‌లు, ఉల్లిగ‌డ్డ‌, నూనె గింజ‌లు వంటి ఆహార ప‌దార్థాల స‌ర‌ఫరా, నిల్వ‌ను నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది.

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వ‌ర్త‌క‌, వాణిజ్యం ( ప్రోత్సాహం, స‌దుపాయ క‌ల్ప‌న )బిల్లు -2020

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌పై రైతుల‌కు పూర్తి స్వేచ్ఛ క‌ల్పిస్తుంద‌ని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం క‌నీస మ‌ద్దతు ధ‌ర కోసం ప్ర‌భుత్వాల‌పై ఆధార‌ప‌డ‌కుండా పండించిన పంట‌ను త‌మ ఇష్టానుసారం రైతులు ఎక్క‌డైనా అమ్ముకోవ‌చ్చు. ఇందులో భాగంగా మార్కెట్ క‌మిటీ స‌రిహ‌ద్దులు దాటి విక్ర‌యించే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై రాష్ట్రాలు కానీ.. స్థానిక ప్ర‌భుత్వాలు కానీ ఎలాంటి ప‌న్నులు, ఫీజులు వ‌సూలు చేయ‌డానికి వీల్లేదు. అంటే త‌మ పంట‌ను అమ్ముకునేందుకు, ధ‌ర‌ను నిర్ణ‌యించుకునేందుకు రైతులు, ప్రైవేటు వ్యాపారుల‌కు ఈ బిల్లు పూర్తి స్వేచ్ఛ క‌ల్పిస్తుంది. ఎల‌క్ట్రానిక్ వ‌ర్త‌కానికి కూడా ఇది అనుమ‌తిస్తుంది. కాబ‌ట్టి ఆన్‌లైన్‌లో క్ర‌య‌విక్ర‌యాల కోసం ఎల‌క్ట్రానిక్ ట్రేడింగ్ వేదిక‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. పాన్‌కార్డు ఉన్న కంపెనీలు, భాగ‌స్వామ్య సంస్థ‌లు, రిజిస్ట‌ర్డ్ సొసైటీలు, ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌, వ్య‌వ‌సాయ స‌హ‌కార సంస్థ‌లు ఏవైనా స‌రే ఆన్‌లైన్ వ‌ర్త‌క వేదిక‌ను ఏర్పాటు చేయ‌వ‌చ్చు.

ధ‌ర‌ల హామీ, వ్య‌వ‌సాయ సేవ‌ల ఒప్పంద బిల్లు

ఈ బిల్లు ప్ర‌కారం ఒక రైతు తాను పంట వేయ‌డానికి ముందే కొనుగోలుదారుడితో నిర్ణీత కాలానికి ఒప్పందం కుదుర్చుకోవ‌చ్చు. క‌నిష్టంగా ఒక పంట‌కాలం నుంచి ఐదేళ్ల వ‌ర‌కు ఈ ఒప్పందాన్ని చేసుకోవ‌చ్చు. ఈ ఒప్పంద ప‌త్రంలోనే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర‌ను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ఒప్పంద వ్య‌వ‌సాయంలో త‌లెత్తే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఒక అథారిటీ ఉంటుంది. అదే మూడంచెల వ్య‌వ‌స్థ స‌యోధ్య బోర్డు, స‌బ్ డివిజిన‌ల్ మెజిస్ట్రేట్‌, అప్పీలేట్ అథారిటీ. ప్రైవేటు వ్యాపారికి, రైతుకు మ‌ధ్య ఒప్పందం స‌మ‌యంలో ఏదైనా వివాదం త‌లెత్తితే మొద‌ట బోర్డు ప‌రిధిలో స‌యోధ్య కుద‌ర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అక్క‌డ ప‌రిష్కారం దొర‌క్క‌పోతే 30 రోజుల తర్వాత స‌బ్ డివిజ‌న‌ల్ మెజిస్ట్రేట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. స‌బ్ డివిజిన‌ల్ మెజిస్ట్రేట్ నిర్ణ‌యం న‌చ్చ‌కుంటే అప్పీలేట్ అథారిటీని సంప్ర‌దించ‌వ‌చ్చు. వీటిలో ఏ స్థాయిలోనైనా స‌రే రైతుకు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం వ‌స్తే రిక‌వ‌రీ కోసం వ్య‌వ‌సాయ భూమిని తీసుకోవ‌డానికి ఈ చ‌ట్టం అంగీక‌రించ‌దు.

ఎందుకు వ్య‌తిరేకించారు?
నిజానికి ఈ మూడు చ‌ట్టాలు రైతులు మేలు చేసేలా క‌నిపించినా ఏ మాత్రం ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన‌వి కావ‌ని రైతు సంఘాలు, విప‌క్షాలు మొద‌ట్నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ చ‌ట్టాల వ‌ల్ల ప్రైవేటు వ్యాపారులు, బ‌హుళ జాతి కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునే ప్ర‌మాద‌మే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వారు ఆరోపిస్తున్నారు. స‌న్న‌కారు రైతుల‌ను ఈ చ‌ట్టాలు క‌ష్టాల్లోకి నెట్టేస్తాయ‌ని.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే రైతులు కూడా ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌కు దిగారు. ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu