ఆర్థరాత్రి నీటమునిగిన నెల్లూరు.. వరదలో పరుగులు తీసిన ప్రజలు
posted on Nov 20, 2021 7:36AM
ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం కొనసాగుతోంది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వరదలు వచ్చాయంటున్నారు రాయలసీమ అధికారులు. వరదలతో ప్రాణ నష్టం కూడా పెరిగిపోతోంది.
నెల్లూరులో గత అర్ధరాత్రి ప్రజలు భయంతో వణికిపోయారు. ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలం అవుతున్న నగరంలో అర్ధరాత్రి దాటాక స్థానిక భగత్‌సింగ్ కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఉదయం నుంచే కొంతకొంతగా నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు బాధితులు కొందరిని అక్కడి నుంచి జనార్దనరెడ్డి కాలనీలోని టిడ్కో ఇళ్లకు తరలించారు.అర్ధరాత్రి దాటాక వరద నీరు కాలనీని పూర్తిగా ముంచెత్తడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. పిల్లలను పట్టుకుని రక్షించుకునేందుకు నడుము లోతు నీళ్లలో పరుగులు తీశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు కాలనీ వాసులను నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలకు తరలించారు.