వైన్స్‌తో వేల కోట్ల ఆదాయం.. తెలంగాణలో ఏపీ వ్యాపారుల ఉత్సాహం..
posted on Nov 19, 2021 6:16PM
ఏ ప్రభుత్వానికైనా కాసులు కుమ్మరించే వ్యాపారం ఏదంటే.. మద్యం షాపులే. తెలంగాణ సర్కారు లిక్కర్ రాబడితోనే మనుగడ సాగిస్తోంది. ఇక, ఏపీ ప్రభుత్వ తలరాత మొత్తం వైన్స్ చుట్టూనే తిరుగుతోంది. సీఎం కేసీఆర్‌కు మద్యం ప్రియులంటే మహా ప్రేమ. అందుకే అడక్కున్నా.. గల్లీ గల్లీలో మద్యం షాపులు పెట్టిస్తున్నారు. తాగాలని లేకున్నా.. తాగేలా టెంప్ట్ చేస్తున్నారు. ఆబ్కారీ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ సరుకు అమ్మిస్తున్నారు. ఇక జగన్‌రెడ్డి ఏమన్నా తక్కువా? రెండు ఫుల్ బాటిళ్లు ఎక్కువే అమ్మిస్తున్నారు. ఊరూపేరు లేని సొంత బ్రాండ్లు తీసుకొచ్చి.. ప్రభుత్వ తరఫునే వైన్స్ పెట్టించి.. మందుబాబుల జేబులు, ఆరోగ్యం అన్నీ లూటీ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు.. మద్యం రాబడినే ష్యూరిటీగా చూపించి.. వేల కోట్ల అప్పులు కూడా చేస్తున్నారు. మరోవైపు, మద్యపాన నిషేధం అంటూ రాజకీయ పబ్బమూ గడుపుకుంటున్నారు. ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమదైన స్టైల్‌లో లిక్కర్ పాలిటిక్స్ చేస్తూ.. ఆ ఇద్దరూ పోటీపడుతున్నారు. అది వేరే విషయం.. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. తెలంగాణలో కరువు తీరేలా మద్యం దుకాణాలు రాబోతున్నాయి. ఖజానా నిండేలా రాబడి ఇప్పటికే వచ్చేసింది. తెలంగాణలో ఈ గ్లాసులు, కాసుల గలగలలో ఏపీ వాటా భారీగా ఉండటం ఆసక్తికరం.
తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. సుమారు 70వేల వరకూ దరఖాస్తులు దాఖలయ్యాయి. రెండేళ్ల క్రితం అప్లికేషన్లతో పోలిస్తే.. ఇది దాదాపు డబుల్. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల ఫీజు వసూలు చేసింది సర్కారు. డ్రాలో మద్యం షాపు రాకున్నా.. ఈ 2లక్షలు రిటర్న్ ఇవ్వరు. ఇలా, ఒక్కసారే గంపగుత్తగా ప్రభుత్వ ఖజానాకు కేవలం దరఖాస్తుల రూపంలోనే సుమారు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చి పడింది. ఇక వైన్స్ ఏర్పాటుకు స్లాబ్‌లను బట్టి వసూలు చేసే రుసుం రాబడి.. ఇంతకంటే భారీ మొత్తమే ఉంటుంది. ఇక లిక్కర్ సేల్స్ మీద వచ్చే పన్నుల బాదుడు అది వేరే లెక్క. తెలంగాణ సర్కారుకు జాక్‌పాట్ తగిలినట్టే.
ఇంతకంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మరోటి ఉంది. తెలంగాణలో వైన్స్ పెట్టేందుకు ఏపీ వ్యాపారులు భారీగా ఎగబడ్డారు. ఏపీ బోర్డర్‌లో ఉండే తెలంగాణ జిల్లాలో చాలా షాపులకు ఏపీ వాళ్లు దరఖాస్తులు చేశారు. ఎందుకుంటే.. తెలంగాణ మద్యానికి ఏపీలో ఫుల్ డిమాండ్ ఉంది. జగనన్న అమ్మే నాసిరకం బ్రాండ్లు తాగలేక.. అంతేసి ధర పెట్టలేక.. చాలామంది ఏపీ వాసులు తెలంగాణ జిల్లాల నుంచే మద్యం కొనుగోలు చేస్తున్నారు. గప్‌చుప్‌గా ఏపీలో తాగుతున్నారు..అమ్ముతున్నారు. అందుకే, తెలంగాణలోనూ మనదే దుకాణం ఉంటే.. ఆ బిజినెస్సే వేరు అనుకుంటూ.. ఏపీ వ్యాపారులు ఈసారి భారీగా అప్లికేషన్లు పెట్టారు.
సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెంలలోని దుకాణాలకు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. సగటున ఒక్కో దుకాణానికి 24 మంది పోటీ పడగా.. సరిహద్దు జిల్లాల్లో మాత్రం యావరేజ్‌న ఒక్కో షాపునకు 40మందికి పైనే పోటీ పడ్డారు. శనివారం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. జగనన్న మద్యం పాలసీ.. ఇలా తెలంగాణకు కాసుల వర్షం కురిపిస్తోందని అంటున్నారు.