ఇన్నాళ్లూ లేనిది.. కవిత ఇంటిపేరు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?

కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా,  పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత. తండ్రి కేసీఆర్ వాగ్ధాటిని పుణికి పుచ్చుకున్న నేత. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరినప్పటి నుంచీ కవిత పార్టీలో మమేకమై పార్టీలో మమేకమై ఉద్యమంలో ముందుండి నడిచారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యమాన్ని వేరే లెవెల్ కు తీసుకు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ విజయంలో కవిత పాత్ర కూడా గణనీయంగా ఉంది. వరుసగా రెండో సారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అంత వరకూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే సాగింది.

ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందో.. అప్పటి నుంచీ కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పొడసూపాయి. కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు కేటీఆర్, కవిత. పార్టీ పరాజయం తరువాత కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాలలోనే గుసగుసలు వినిపించడం మొదలైంది.  ఎప్పుడైతే  కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీకైందో.. అప్పటి నుంచే ఇరువురి మధ్యా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కవిత తన సొంత దారి చూసుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే కవిత అడుగులూ పడ్డాయి.  తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తన ఇంటికి సమీపంలోకి మార్చుకున్న కవిత.. బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ద్వారానే రాజకీయం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే యువతనుజాగృతిలోకి ఆహ్వానించారు. ఆమె పిలుపు మేరకు ఇటీవల పెద్ద  ఎత్తున యువత జాగృతి సంస్థలో చేరారు. వారికి కవిత సంస్థ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక మీడియా సంస్థ మాత్రం కవిత ఇంటిపేరును కల్వకుంట్ల అని కాకుండా దేవనపల్లి అని పేర్కొంది. దేవనపల్లి కవిత భర్త అనీల్ ఇంటి పేరు. ఇంత కాలంగా కవితను కల్వకుంట్ల కవితగానే అంతా పేర్కొంటూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా అదీ ఓ మీడియా సంస్థకు కవిత ఇంటిపేరు కల్వకుంట్ల కాదు అంటూ ప్రచురించాలనీ. ప్రచారం చేయాలనీ అనిపించింది. అంటే కేసీఆర్ కుటుంబం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచీ ఆమెను వేరు చేసే ప్రయత్నమే ఇదని పరిశీలకులు విశ్లేషించారు. 

సరిగ్గా సోదరుడితో విభేదించిన తరువాత వైఎస్ షర్మిల పేరుకు ముందు ఆమె భర్త ఇంటిపేరు ఎలా అయితే చేర్చి అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ సొంత మీడియా ప్రచురించాయో, ప్రచారం చేశాయో.. సరిగ్గా అలాగే ఇప్పుడు కవిత విషయంలో జరగడం యాధృచ్చికం ఎంత మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు.