ప్లాస్మా ఎవరి నుంచి సేకరించాలి.?

కోవిడ్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పట్లో అందరికీ అందుబాటులోకి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. దాంతో కరోనా సోకిన వారికి ప్లాస్మా చికిత్సను అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు వైద్యులు. కరోనా సోకి తగ్గిపోయిన వారి నుంచి సేకరించే ప్లాస్మాతో మరికొంతమందికి మెరుగైన చికిత్స అందించ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరీ కరోనా నుంచి బయటపడిన వారంతా ప్లాస్మా ఇవ్వవచ్చునా అంటే కాదనే చెప్పాలి. 

 

ప్లాస్మాను అందరి నుంచి తీసుకోవటం కుదరదు. దీనికి పరిమితులున్నాయి. కరోనా జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నవారే ప్లాస్మాను ఇవ్వటానికి అర్హులు. కోలుకోవటానికి ముందు రెండు సార్లు వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యిండాలి. అలాగే 28 రోజుల తర్వాత కూడా జబ్బు లక్షణాలేవీ ఉండకూడదు. రక్తంలో హిమోగ్లొబిన్‌ 12.5శాతం కన్నా ఎక్కువగా , శరీర బరువు 55 కిలోల కన్నా ఎక్కువగా ఉండాలి. 18-50 ఏళ్ల మధ్యలో ఉన్నవారి నుంచే ప్లాస్మాను సేకరించాల్సి ఉంటుంది. వీరికి గుండె వేగం, రక్తపోటు వంటివన్నీ మామూలుగా ఉండాలి. రక్తం ద్వారా సంక్రమించే హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ వంటి జబ్బులేవీ ఉండకూడదు. రక్తం గ్రూపులూ ఒకటే అయ్యిండాలి. ఇవన్నీ సరిపోయిన వారి నుంచే ప్లాస్మాను తీసుకుంటారు. యాంటీబాడీల సంఖ్య ఎక్కువగా ఉండటమూ ముఖ్యమే. మహిళల విషయంలో- గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరు నెలల లోపు అబార్షన్లు అయినవారు ప్లాస్మా ఇవ్వటానికి అర్హులు కారు.

 

ఒక వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాతో ఇద్దరికి వైద్యం అందించవచ్చు. అలాగే ఒక వ్యక్తి ఏడాది కాలంలో 24సార్లు ప్లాస్మా ఇవ్వవచ్చు. అంటే 15రోజులకు ఒకసారి ప్లాస్మా దానం చేయవచ్చు. ఇలా చేస్తే ఒక వ్యక్తి ద్వారా 48మంది ప్రాణాలను కాపాడే వీలు ఉంటుంది. అయితే ప్లాస్మా దానం చేసే వ్యక్తి సరైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్నికాపాడుకోవాలి.