తుమ్ములు ఎక్కువయితే..!

ముక్కు పూర్తిగా బ్లాక్‌ అవుతుందా. తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయా.. ఊపిరి ఆడటం లేదా... అలాగే తుమ్ములు ఆగకుండా వస్తున్నాయా.. కరోనా సమయంలో ఇలాంటి లక్షణాలు భయపెట్టేస్తాయి. అయితే ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు పట్టేయడం వంటి లక్షణాలకు కరోనానే కారణం కాదు. ఇతర కారణాలవల్ల కూడా ఈ అనారోగ్య లక్షణాలు కనిపించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇవాళ తెలుసుకుందాం? దీనికి పరిష్కారం మార్గాలు, వైద్యుల సలహాలు చూద్దాం..

 

ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు పట్టేయడం జరగడానికి కారణం ఎడమ వైపు ముక్కులో అలర్జీ, సైనస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉండటమే. దీనివల్ల ముక్కులో నీటి పదార్థాలు ఎక్కువగా చేరుతాయి. అలర్జీతో ముక్కులో కొన్ని రకాల జీవరసాయన చర్యలు జరగడం వల్ల రసాయనాలు ఎక్కువగా తయారవుతాయి. వీటివల్ల తుమ్ములు వస్తాయి. ఇలా తుమ్ములు ఆగకుండా వచ్చినప్పుడు అలర్జీకి సంబంధించిన మందులు వీలైనంత తొందరగా మొదలు పెట్టాలి. దాంతో రక్తస్రావం నివారించవచ్చు. అలర్జీ జన్యువుల ద్వారా వచ్చే సమస్య ఇది. కొన్నేండ్ల పాటు ఉంటుంది. ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువ ఉండవచ్చు. అందువల్ల అలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా చాలా కాలం వాడాల్సి ఉంటుంది. సైనసైటిస్‌, ఆస్తమా సమస్యలు రాకుండా నివారించవచ్చు. ముక్కు బ్లాక్‌ కావడం, తుమ్ములు రావడానికి ముందే ముక్కులో అలర్జీకి సంబంధించిన చర్యలు జరుగుతాయి. వీటివల్ల ముక్కు లోపల చర్మం పాడవుతుంది. ఇది 30 నుంచి 40 శాతం పాడైన తరువాత అలర్జీ లక్షణాలు బయటపడుతాయి. మందులు మొదలుపెట్టిన వారం రోజులకే అలర్జీ తగ్గిపోయినప్పటికీ ముక్కు లోపల జరిగే ఉత్ప్రేరకాల ప్రక్రియ కొన్ని వారాలు, నెలల పాటు జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల చర్మం పాడవకుండా ఉండాలంటే అలర్జీ మందులు లక్షణాలు తగ్గిన తరువాత కూడా కనీసం రెండు మూడు నెలలు వాడాలి. అలా వాడటం వల్ల ఆస్తమా రాకుండా ఆపవచ్చు. వీలైనంత త్వరగా నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.