ప్రియాంక గాంధీ పోటీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదేనా?

కాంగ్రెస్​ పార్టీపై, బీజేపీ చేసే ప్రధాన ఆరోపణ.. వారసత్వ రాజకీయం. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే.. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ.. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు. అందుకే ఆమె ఈ లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేయ‌డం లేదు. బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ఆమె విముఖత చూపారట‌.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తో పాటు బీజేపీ నేతలంతా, కాంగ్రెస్‌ ను వారసత్వ పార్టీ అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  ఇప్పటికే సోనియా కుటుంబం నుంచి ఆమెతో పాటు ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ఎంపీలుగా ఉన్నారు. సోనియాగాంధీ 1998 నుంచి రాహుల్‌ గాంధీ 2004 నుంచి ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీలుగా కొనసాగుతుండటంతో,  ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తే బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ప్రియాంక పోటీకి దూరంగా వున్నారు.  అమేథి, రాయబరేలిల్లో ఎక్కడో చోట నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రతిపాదనను ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. బీజేపీ వారసత్వ రాజకీయాల విమర్శలకు భయపడే ప్రియాంక పోటీకి దూరంగా వున్నారు. 

గ‌త కొంత కాలంగా రాయ్ బరేలిలో ప్రియాంక పోటీ చేస్తారంటూ తెగ ప్ర‌చారం జ‌రిగింది.  ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లోని అమేథి, రాయ్ బరేలి లోక్ సభ స్థానాలు మొదటి నుంచి గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్నాయి.  గత లోక్ సభ ఎన్నికల్లో అమేథి నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే రాహుల్ గాంధీ అమేథి నుంచి ఓడిపోయినప్పటికీ కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జరిగే లోక్ సభ ఎన్నికల్లో  వయనాడ్ తో పాటు, రాయ్ బరేలి నుంచి రాహుల్‌ పోటీ చేస్తున్నారు. 

రాయబరేలిలో 2004 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్‌ గాంధీ  పోటీ చేస్తున్నారు. అయితే అమేథిలో ఓటమి భయం వెంటాడటం వల్లే రాహుల్‌ గాంధీ అక్కడి నుంచి పారిపోయి రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.  

ఈ ఎన్నికల్లో పోటీ చేసి కేవ‌లం ఒక‌ నియోజకవర్గానికే పరిమితం కావడం కంటే దేశవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ  బలోపేతానికి కృషి చేయాలని ప్రియాంక గాంధీ భావిస్తున్నారు.  మోదీ వేవ్​తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్​కు స్టార్ క్యాంపెనీయ‌ర్ గా ప్రియాంక గాంధీ ప్ర‌చారం చేస్తున్నారు.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌