కూటమికే యువత జై!

వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత పందేరం చేసే హక్కు, అధికారం జగన్ కు ఎక్కడిదని యువత నిలదీస్తున్నారు.

ఉపాధి, ఉద్యోగ కల్పన గురించి పట్టించుకోకుండా.. అధికార పగ్గాలు అందుకున్న క్షణం నుంచీ మరో సారి అధికారం కోసం ఉచిత పందేరాలే శరణ్యం అంటూ సాగిన జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అధమ స్థానానికి చేరిన వైనాన్ని యువత గుర్తించారు. ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వలస వెళ్లాల్సిన అవసరం మాకేంటి అంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఢోకా ఉండదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మా మద్దతు తెలుగుదేశం కూటమికే నంటూ జై కొడుతున్నారు.  మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే  రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం ఉందంటున్నది ఏపీ యువత.  

మరీ ముఖ్యంగా తాజాగా నమోదైన కొత్త ఓటర్లయితే.. ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలు చాలు. ఇక అనుభవజ్ణుడైన చంద్రబాబుకే మా మద్దతు అంటున్నారు. ఇలా ఈ సారి ఎన్నికలలో తొలి సారి ఓటు వేయడానికి తమ ఓటు నమోదు చేయించుకున్న వారి సంఖ్య కోటీ పదిలక్షల పైనేనన్నది ఓ అంచనా.  
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అనేక కంపెనీలు ఏపీకి తరలివచ్చాయి. దానికోసం ఆయన  ఎంతో కృషి చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయన కోసం దేశ విదేశాల్లోని తెలుగు వారంతా కదిలిన వైనాన్ని చూపుతూ ఆయన విధానాలు వేలాది, లక్షలాది మందికి ఐటీలో ఉన్నతోద్యోగాలు వచ్చేలా చేశాయని చెబుతున్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయంలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో జాతీయ-అంతర్జాతీయ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఫలితంగా ఉత్తరాంధ్ర-కోస్తా నిరుద్యోగ యువకులకు, బయట రాష్ట్రాలకు వెళ్లే పని లేకుండా పోయిందని చెబుతున్నారు.  

అయితే  వైసీపీ  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ విధానాల కారణంగా చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పక్క రాష్ట్రాలకు తరలిపోయిన సంగతిని యువత ప్రముఖంగా ప్రస్తావిస్తూ తమ మద్దతు చంద్రబాబుకే. తెలుగుదేశం కూటమికే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.