మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి!!

ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి. అవును.. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే ఈ రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ముందుగానే రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితంలో ఆ రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. అందులో ఒకటి మే 13 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగే రోజు. మరోరోజు జూన్ 4 ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడయ్యే రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీలో మే 13 అనే గొప్ప తేదీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయిదేళ్ళుగా తమను పట్టి పీడిస్తున్న కరోనా కంటే డేంజరస్ అయిన జగన్ అనే మహమ్మారిని ఓటు అనే వ్యాక్సిన్‌తో వదిలించుకునే అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మే 13 వస్తుందా.. ఎప్పుడెప్పుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి గతంలో తాము చేసిన పొరపాటును సరిదిద్దుకుందామా అని ఆత్రుతపడుతున్నారు. తాము ఓటు హక్కు వినియోగించుకుని పీడ విరగడ చేసుకునే రోజును నరక చతుర్దశిగా, ఎన్నికల ఫలితాలు విడుదలై, జగన్ ప్రభుత్వ పీడ విడగడయ్యే జూన్ 4వ తేదీని దీపావళిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించడం సమంజసమే కదా!