వాట్సప్ మెసేజ్ లకి, వాస్తవాలకి తేడా తెలుసుకోలేకపోతున్న జనం!

సైన్స్ , టెక్నాలజీ ఎప్పుడూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటాయి. అయితే, కొన్ని సార్లు వాటి ప్రభావం మంచికి దారి తీస్తే కొన్ని సార్లు చెడు ఎదురవుతూ వుంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా ఆవిష్కరణలు, సాంకేతిక అద్భుతాలు ఒక ఉద్దేశంతో మొదలై ఎక్కడో ముగుస్తున్నాయి. చివరకు, విషాదాలకి దారి తీస్తున్నాయి! సోషల్ మీడియా కూడా ఆ లిస్టులో చేరింది!

 

 

కంప్యూటర్ కనుగొన్న సైంటిస్టుకి ఇంటర్నెట్ అంటూ ఒకటి వస్తుందని తెలియకపోవచ్చు. అలాగే, ఇంటర్నెట్ రూపొందించిన శాస్త్రవేత్తలకు ఫేస్బుక్, వాట్సప్ లాంటివి ఊహల్లో కూడా వుండకపోవచ్చు! కానీ, ఇవాళ్ల అవ్వి అంగీకరించి తీరాల్సిన నిజాలు! ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ లాంటివి ఎంతో మేలు చేస్తున్నాయన్నది కూడా నిజమే. అదీ ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, ఇండియా లాంటి దేశాల్లో మేలు చేసే సోషల్ మీడియా తలనొప్పులు కూడా తెచ్చి పెడుతోంది. అదే ప్రభుత్వానికి కూడా సమస్యగా మారింది!

సోషల్ మీడియాలో ఇతర సైట్లు కూడా వున్నా… స్మార్ట్ ఫోన్లనే నమ్ముకున్న వాట్సప్ యాప్ దుమారం రేపుతోంది. ట్విట్టర్ కంటే, ఫేస్బుక్ కంటే వాట్సప్ సామాన్యులకి అత్యంత అందుబాటులో వుంటూ అవసరాలు తీరుస్తోంది. మాటలు, పాటలు, కథలు, కవితలు, వీడియోలు, ఆడియోలు… ఇలా ఒక్కటని కాకుండా అన్నీ షేర్ చేసుకుంటున్నారు కామన్ ఇండియన్స్. వాట్సప్పే అందరికీ దిక్కైపోయింది. కానీ, వాట్సప్ వాడే క్రమంలో తెలిసీ , తెలియక గందరగోళానికి, విషాదాలకి కూడా భారతీయులే కారణం అవుతున్నారు!

 

 

వాట్సప్ కంపెనీ వారు అధికారికంగా చెబుతోన్న సమాచారం ప్రకారం కూడా ఇండియన్స్ మెసేజ్ లు ఫార్వార్డ్ చేయటంలో అందరి కంటే ముందున్నారట. ప్రపంచంలో వాట్సప్ వాడే వారందరిలో మన భారీయులే మెసేజ్ ఫార్వార్డ్ ఆప్షన్ విపరీతంగా వాడుతున్నారట. ఇదే ఇప్పుడు సమస్యలకి కారణం అవుతోంది. ప్రాణాలు కూడా తీస్తోంది. తమకు వచ్చిన మెసేజ్ వెనకా ముందు ఆలోచించకుండా తమ కాంటక్ట్స్ లో వున్న అందరికీ పంపేస్తున్నారు. అలా వెళ్లిన మెసేజ్ ప్రభావం చాలా తీవ్రంగా వుంటోంది. ఈ మద్యే బళ్లారి ప్రాంతంలో హైద్రాబాద్ నుంచి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానంతో కొట్టి చంపారు. పిల్లల్ని ఎత్తుకెళ్లే కిడ్నాపర్లు రెడ్ కార్లో వస్తున్నారన్న వాట్సప్ మెసేజే ఆ విషాదానికి కారణం! ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.

 

 

కాశ్మీర్ లాంటి కల్లోల ప్రాంతాల్లో కూడా వాట్సప్ మెసేజ్ లు సంక్షోభానికి దారి తీస్తున్నాయి. రెచ్చగొట్టే తప్పుడు సందేశాలు వైరల్ గా మారిపోయి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. అందుకే, ఏ చిన్న అల్లరి మొదలైనా ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలు ఆపేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది టెక్నాలజీని ఎలా వాడుకోవాలో అర్థం కాని అజ్ఞానం, అత్యుత్సాహం! వాట్సప్ ఆమెరికాలోనూ, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ కూడా వుంది. కానీ, అక్కడ ఇలా ఫార్వర్డ్ మెసేజీల సమస్య లేదు. వాట్సప్ మెసేజ్ లు చూసి జనం రెచ్చిపోరు. ఎందుకంటే, టెక్నాలజీని వాడుకోవటంలో వారు విచక్షణ చూపుతున్నారు. మన దగ్గర అది కొరవడుతోంది.

 

 

వాట్సప్ కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తప్పుడు వార్తల విషయమై నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో రెండు సార్లు తీవ్రంగా హెచ్చరించింది. వాట్సప్ వారు కూడా ఎలా ఫేక్ మెసేజ్ లు ఫిల్టర్ చేయాలా అని ఆలోచిస్తున్నారట. నియమాలు, నియంత్రణలు ఎలా వున్నా… జనం వాట్సప్ లాంటి ఆధునిక సౌకర్యాల్ని తెలివిగా, వివేకంతో వాడుకోవాలి. అంతే తప్ప తమకు ఏది వచ్చినా దాన్ని అందరికి చేరవేసి అనవసర సంకోభాలకి తెర తీయవద్దు. అలాగే, సున్నితమైన విషయాలపై వాట్సప్ లాంటి ఓపెన్ ఫోరమ్ లలో వచ్చే ప్రతీ మాటని నమ్మవద్దు. అన్నిటికి రెచ్చిపోతూ రోడ్ల మీదకొచ్చే ఉన్మాదాన్ని జనం మానుకోనంత వరకూ ఎంత మంచి ఆవిష్కరణ అయినా చెడుకే దారి తీస్తుంది. ప్రభుత్వం దీనిపై జనాన్ని చైతన్య పరచాలి!