చంద్ర‌బాబు అంత‌లా ఎందుకు ఏడ్చారు? అసెంబ్లీలో అస‌లేం జ‌రిగింది?

చంద్ర‌బాబు భోరున విల‌పించారు. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. త‌న్నుకొస్తున్న ఏడుపును ఆపుకోలేక‌పోయారు. ముభానికి చేతులు అడ్డుపెట్టుకొని మ‌రీ విల‌విలా ఏడ్చేశారు. చంద్ర‌బాబును అంత‌లా ఏడిపించారు దుర్మార్గులు..వైసీపీ నాయ‌కులు. అసెంబ్లీలో చంద్ర‌బాబునే కాదు ఆయ‌న అర్థాంగి భువ‌నేశ్వ‌రిపైనా ప‌రోక్షంగా అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని చంద్ర‌బాబు భ‌రించ‌లేక‌పోయారు. అంబ‌టి రాంబాబు నోటికొచ్చిన‌ట్టు వాగడం.. చంద్ర‌బాబు మండిప‌డ‌టం.. ఆ త‌ర్వాత అంబ‌టి వ్యాఖ్య‌ల‌ను క‌వ‌ర్ చేసేలా మంత్రి కొడాలి నాని డైవ‌ర్ట్ చేయ‌డం.. స‌భ‌లో ర‌చ్చ ర‌చ్చ న‌డిచింది. 

ఉద‌యం నుంచీ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జ‌ర‌గుతూ వ‌చ్చింది. మంత్రులు కొడాలి నాని రెచ్చిపోయి మాట్లాడారు. ‘చంద్రబాబులా మేం లుచ్చా పనులు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీడీపీ సభ్యులు ‘చంచల్ గూడ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ’ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వెంటనే కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ పట్టుబట్టింది.

నాని వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ‘వ్యవసాయంపై చర్చతో పాటు బాబాయికి గొడ్డలి పోటు, తల్లికి ద్రోహం సహా అన్ని విషయాలపై చర్చకు సిద్దమే’ అని బాబు సవాలే విసిరారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో మరో మంత్రి కన్నబాబు.. హెరిటేజ్ సంస్థ విషయం ప్రస్తావనకు తెచ్చారు. మంగళగిరిలో తనయుడు ఓటమిని తట్టుకున్న చంద్రబాబు కుప్పం ఓటమిని తట్టుకోలేరా..? అంటూ కన్నబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. చాలాసేపు ఇరు స‌భ్యుల మ‌ధ్య కౌంట‌ర్లు న‌డిచాయి. 

ఇక అంబటి రాంబాబు.. స‌భ‌లో మ‌రింత డ‌బుల్ మీనింగ్‌తో మాట్లాడారు. చంద్రబాబును అవమానపరుస్తూ వెట‌కారంగా మాట్లాడుతూ.. మాధ‌వ‌రెడ్డి పేరు ప్ర‌స్తావిస్తూ వేరే మీనింగ్ వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప‌రోక్షంగా గుర్తు చేశారు. అంబ‌టి అలా మాట్లాడ‌టంతో తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు స‌భ‌లోనే కంటతడి పెట్టారు. అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తూ.. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే స‌భ‌లో అడుగుపెడ‌తానంటూ ప్ర‌క‌టించారు. 

చంద్ర‌బాబు వెళ్లిపోయాక కూడా వైసీపీ స‌భ్యుల అవ‌హేళ‌న‌ ఆగ‌నే లేదు. అంబ‌టి రాంబాబు కామెంట్ల‌ను క‌వ‌ర్ చేసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడారు. చంద్ర‌బాబు.. వైఎస్‌ వివేకా హ‌త్య కేసు ప్ర‌స్తావించారు కాబట్టి.. అంబ‌టి రాంబాబు.. దివంగ‌త మాధ‌వ‌రెడ్డి మ‌ర్డ‌ర్ టాపిక్‌ను గుర్తు చేయ‌డానికే ఆయ‌న పేరు ప్ర‌స్తావించారంటూ స‌మ‌ర్థించే ప్ర‌య‌త్నం చేశారు. అంబ‌టి సైతం మ‌ళ్లీ మైక్ అందుకొని తాను అలానే అన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా స‌భ‌లో జ‌రిగితే.. అసెంబ్లీ బ‌య‌ట మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు క‌న్నీటిప‌ర్యంత మ‌య్యారు. 

అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్చారు. క‌న్నీరు ఆగ‌క ప్రెస్‌మీట్‌లోనే భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషిస్తే.. తాను గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. ఈ కౌరవ సభ.. గౌరవం లేని సభ. 

"ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదు. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత బాధ భరించలేదు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించా. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నా. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు" అన్నారు చంద్ర‌బాబు.  

"స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడుతుండగానే నా మైక్‌ కట్‌ చేశారు. గతంలో తెదేపా ప్రభుత్వంలో తమ్మినేని మంత్రిగా పనిచేశారు. గౌరవంగా బతికేవాళ్లను కూడా కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నా. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు." అని చంద్రబాబు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu