వివేకా హత్యలో అవినాశ్ పాత్రపై జగన్ క్లారిటీ..!
posted on Nov 19, 2021 3:18PM
వైఎస్ వివేకా హత్య జరిగి రెండేళ్లు దాటేసింది. ఈ రెండేళ్లూ జగన్‌రెడ్డినే సీఎంగా ఉన్నారు. అయినా, బాబాయ్ హత్య కేసు తేల్చలేకపోయారు. వివేకా హంతకులను పట్టుకోలేకపోయారు. వివేకా కూతురు సునీత పట్టు వదలకుండా పోరాడుతుండటంతో.. సీబీఐ విచారణ జరుగుతోంది. ఆ కేసు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలను సీబీఐ నిందితులుగా తేల్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారి.. హత్య కేసు కుట్ర మొత్తం బయటపెట్టారు. పరోక్షంగా పెద్దలు సహకరించారని వాగ్మూలం ఇచ్చారు. ఎంపీ అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా కేసు బలపడుతోంది. సరిగ్గా.. ఇలాంటి సమయంలో సీఎం జగన్‌రెడ్డి వివేకా హత్య కేసుపై స్పందించడం.. ఎంపీ అవినాశ్‌రెడ్డికి సంబంధం లేదన్నట్టు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. కేసును పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్ క్లీన్ చిట్ ఇచ్చారు. అవినాష్‌రెడ్డి మరో చిన్నాన్న కొడుకు అని.. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుందని చెప్పుకొచ్చారు. తమ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు.
గతంలో మా చిన్నాన్నను ఓడించడానికి.. మా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను లాక్కొన్నారని టీడీపీపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలోనే ఇదంతా జరిగింది కాబట్టి.. మా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది వాళ్లే చేసి ఉండాలంటూ మళ్లీ పాత పాటే అందుకున్నారు.