తల్లిని దూషించారు.. భార్యను అవమానించారు.. చంద్రబాబు భావోద్రేగం..
posted on Nov 19, 2021 2:12PM
అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. కన్నీరు ఆగక ప్రెస్‌మీట్‌లోనే భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషిస్తే.. తాను గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. ఈ కౌరవ సభ.. గౌరవం లేని సభ అంటూ మండిపడ్డారు.
మీడియా సమావేశంలో గుండెలవిసేలా విలపించారు చంద్రబాబు. రెండు నిమిషాల పాటు మాట్లాడలేకపోయారు. ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇళ్లల్లోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచంగా పడిపోయాయనుకోలేదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
"ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదు. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత బాధ భరించలేదు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించా. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నా. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు" అన్నారు చంద్రబాబు.
"జగన్ ప్రజల పాలిట భస్మాసురుడిగా మారారు. ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి.. నాకు పదవులు అవసరం లేదు. నా రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుంది. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించారు. హుద్‌హుద్ సమయంలో విశాఖలో చాలా రోజులున్నా." అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
"స్పీకర్ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడుతుండగానే నా మైక్ కట్ చేశారు. గతంలో తెదేపా ప్రభుత్వంలో తమ్మినేని మంత్రిగా పనిచేశారు. గౌరవంగా బతికేవాళ్లను కూడా కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నా. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు." అని చంద్రబాబు అన్నారు.
పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశానని, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశానని చంద్రబాబు అన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు తాను చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.