మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య లింక్ ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ఇది విజృంభించింది. ఇప్పుడు యువత కూడా దీని బారిన పడే పరిస్థితి నెలకొంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసిక-శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. ఒకదాని ప్రభావం మరొకదాని పై ఉంటుంది. 

డిప్రెషన్‌ను కేవలం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యగా మాత్రమే పరిగణించరాదని డిప్రెషన్‌పై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు తెలిపారు. అనేక రకాల శారీరక దుష్ప్రభావాల ప్రమాదం కూడా ఉంటుంది. డిప్రెషన్‌కు గురైనట్లయితే, మైగ్రేన్, గుండె జబ్బులు, రక్తపోటు,  రోగనిరోధక శక్తి బలహీన పడటం వంటి సమస్యలు కూడా ఉంటాయి.

మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య సంబంధం..

మైగ్రేన్ సాధారణ తలనొప్పి సమస్య అని అనుకుంటే పొరపాటే.. మైగ్రేన్ సైకోసోమాటిక్ డిజార్డర్ అని పరిశోధకులు కనుగొన్నారు. మానసిక రుగ్మతలు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలు. ఇవి కూడా శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు మైగ్రేన్‌  వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని, మైగ్రేన్‌ ఉన్నవారు ఐదు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని తేలింది. 

మైగ్రేన్ వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం..

 మైగ్రేన్, డిప్రెషన్, స్ట్రెస్ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. వాస్తవానికి, మైగ్రేన్‌ ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. మైగ్రేన్ ప్రారంభమైన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత చాలా మందిలో డిప్రెషన్ మొదలవుతుంది. మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ జన్యుపరమైనవి కూడా కావచ్చు.

డిప్రెషన్ ఉన్న రోగులలో మైగ్రేన్ రిస్క్

మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ తక్కువ స్థాయి 5-హైడ్రాక్సీట్రిప్టమైన్ (5-HT) లేదా సెరోటోనిన్ రిసెప్టర్లకు సంబంధించినవి. సెరోటోనిన్ ట్రాన్స్పోర్టర్లు కూడా జన్యు మార్పులకు కారణం అవుతాయి. మైగ్రేన్ అనేది జీవిత నాణ్యతను ప్రతికూలంగా మారుస్తుంది. ఇది ఇతర  మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

అదేవిధంగా, మైగ్రేన్, డిప్రెషన్ ఉన్నవారిలో కాలక్రమేణా సైకోసోమాటిక్ డిజార్డర్‌గా మార్పు చెందుతాయి. 

ఇవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ ఒక్కటి వచ్చినా మరొకటి మెల్లిగా డవలప్ అవుతుంది. కాబట్టి వీటికి దూరం ఉండటం అన్ని విధాలా మంచిది.

                                   ◆నిశ్శబ్ద.