ఈ మూడు సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి చాలా ప్రమాదం కలిగిస్తుంది!

ఏవైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆందోళన పడటం సహజం. ఆ ఆందోళన కాలక్రమేణా నయమవుతుంది. కానీ , కారణాలు పెద్దగా లేకున్నా తరచుగా ఆందోళన చెందేవారు చాలామంది ఉంటున్నారు. ఇలా ఆందోళన చెందేవారు ఈ ఆందోళన కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా,  శారీరక ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఒత్తిడి నియంత్రణ చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. 

 ఆందోళన చాలా కాలంగా ఉంటూ అది అదుపులోకి రాకపోతే ఈ సమస్యకు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే  ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఆందోళన-ఒత్తిడి సమస్యలు నాడీ వ్యవస్థ, మధుమేహం నుండి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

ఎక్కవగా ఆలోచించడం, ఆందోళన చెందడం ఈ కింది సమస్యలున్నవారితో ప్రమాదం పెంచుతాయి. 

మధుమేహ వ్యాధిగ్రస్తులలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది.. 

దేనిగురించైనా ఆందోళన చెందుతున్నప్పుడు, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఒత్తిడి మధుమేహానికి కారణం కాదని పరిశోధకులు కనుగొన్నారు, కానీ అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కళ్ళ నుండి గుండె జబ్బులు, నరాల వరకు ప్రతిదానిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.

నరాల మీద దుష్ప్రభావాలు.. 

నరాలు మెసేజింగ్ నెట్‌వర్క్‌ల లాగా పనిచేస్తాయి. ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల  హృదయ స్పందన రేటు, శ్వాసను ప్రభావితం చేసే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపించవచ్చు. చాలా కాలం పాటు అనియంత్రిత ఒత్తిడి స్థాయిలు రక్తంలో చక్కెర, నరాల సమస్యలకు దారితీస్తాయి.  ఒత్తిడి-డిప్రెషన్‌తో బాధపడేవారిలో స్ట్రోక్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం.

గుండె ఆరోగ్యంపై ప్రభావం..

ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది  రక్తపోటు ఎక్కువగా ఉండేలా చేస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూ, ఆలోచిస్తూ ఉంటే , శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్  గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇలా పదే పదే జరిగితే,  రక్తనాళాలు ఎర్రబడి, తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది.

ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలే కాదు.  మొత్తం శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.

                                        ◆నిశ్శబ్ద.