పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ప్లాన్.. స్టాంప్ పేపర్ పై బాండ్

 

రాష్ట్రం ఏదైనా కానీ పార్టీ ఫిరాయింపులు మాత్రం కామన్. అధికారంలో ఉన్న పార్టీల్లోకి నేతలు జంప్ అవ్వడం పారిపాటైపోయింది. అయితే ఈ పార్టీ ఫిరాయింపులను ఆపేందుకు కాంగ్రెస్ ఓ కొత్త పథకాన్ని ఎంచుకుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంత ఫలితాలు రాలేదు. దీంతో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను తట్టుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. దీనిలో భాగంగానే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి.. తాము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని, రూ. 100 స్టాంప్ పేపర్ పై బాండ్ రాసి ఇవ్వాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులతో బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడానికి ఇదేమి బాండ్ పేపర్ కాదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించకుంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. పార్టీ పట్ల విధేయతపై వారి బాధ్యతలను గుర్తు చేసేందుకే ఇలా అడిగాం" అని చౌదరి వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూద్దాం.