సంపద సృష్టితోనే అభివృద్ధి, సంక్షేమం.. బాబు తారకమంత్రం అదే!

కంప్యూటర్లు కూడు పెడతాయా అన్న  రోజులలో ఒకే ఒక్కడుగా ఐటీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా శ్రమించారు. యువత ఉజ్వల భవిష్యత్ కోసం కలలుగని, ఆ కల నెరవేర్చుందుకు శ్రమించి, తపించి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చారు. అది చాలదా..? ఒక్క ఐటీ పరిశ్రమ వల్ల ఒక్క సారిగా ఏపీ ముఖచిత్రమే మారిపోయింది.

వేలు, లక్షల మందికి జీవితంలో స్థిరపడేలా ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మంచి జీతాలతో ఉద్యోగాలు పొందిన వారు వెంటనే సొంతింటి నిర్మాణంపై దృష్టిసారించాయి. దీంతో వారు హోంలోన్ లు తీసుకున్నారు. బ్యాంకింగ్ రంగం వృద్ధి చెందింది. అపార్ట్ మెంట్ల నిర్మాణం జోరందుకుంది. నిర్మాణ రంగం పరుగులు తీసింది. వారి కొనుగోలు శక్తి పెరిగింది. బ్రాండెడ్ దుస్తుల కొనుగోళ్లు పెరిగి టెక్స్ టైల్ ఇండస్ట్రీ వృద్ధి చెందింది.  వీకెండ్ విహారాలు పెరిగాయి. పర్యాటక రంగం జోరందుకుంది. అంతేనా ఎంటర్మైన్ మెంట్, ఏవియేషన్ ఇండస్ట్రీ అభివృద్ధిలో, పురోగమనంలో కొత్త పుంతలు తొక్కాయి. సొంత ఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకోవడం, హంగుల ఏర్పాటుపై ఐటీ ఉద్యోగులు దృష్టి పెట్టారు. టీవీ, గృహోపకరణాల కొనుగోళ్లు పెరిగాయి, హోంఅప్లయెన్సెస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా, శాఖోపశాఖలుగా విస్తరించింది.  అంతేనా ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ఫుడ్ ఇండస్ట్రీ అనూహ్యంగా జోరందుకుంది. ఇలా ఒకటేమిటి.. ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న ప్రతి పురోగతి వెనుకా చంద్రబాబు విజనే ఉంది.  ప్రజల ఆర్థిక ప్రమాణాలు పెరగడం టాక్స్ పేయర్ల ను పెంచింది. దిగువ మధ్యతరగతి మధ్యతరగతిగా ఎదిగింది. మధ్యతరగతి ఎగువ మధ్య తరగతిగా ఎదిగింది.

ఇలా ఎదిగిన ప్రతి కుటుంబమూ మా వాడికి, మా అమ్మాయికీ ఐటీ ఉద్యోగం వచ్చింది, మంచి జీతం వస్తోంది అందుకే బాగుపడ్డాం అని చెబుతారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ లక్షలాది మంది తెలుగు యువకులను విదేశాలకు వెళ్లి లక్షల్లో వేతనాలు సంపాదించేలా చేసింది. ఉభయ తెలుగురాష్ట్రాలలో లక్షల కుటుంబాలు చెప్పే జవాబులు ఇవే. అంతే కానీ ఎవరూ కూడా ఫలానా ఉచిత పథకం వల్ల మా దశ తిరిగింది. మేం బాగుపడ్డాం అని చెప్పే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాజాభివృద్ధికి అవసరం. అభివృద్ధి ద్వారా సృష్టించిన సంపదని సమాజానికి పంచాలి. తప్ప అప్పులు, పన్నులు ద్వారా కాదు. అందుకే జనం ఆలోచించాలి.  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి 

తాత్కాలిక లబ్దిపై వల్ల ప్రయోజనం ఉండదు. దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. చంద్రబాబులో ఉన్నది అదే. అందుకే ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తే ఆయన దార్శనికత కారణంగా బాగుపడిన ప్రతి యువకుడూ ఆవేదన చెందుతున్నారు. తమ కంఫర్ట్ జోన్ ను వదిలి పోలీసు ఆంక్షలను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ సంఘీభావం తెలుపుతున్నారు.