మజ్లిస్ కు వోటేస్తాం, బిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాం

పాతబస్తీ వోటర్లు విభిన్న శైలి. ఇక్కడి ముస్లింలు వోటు వేసేది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేసేది మాత్రం బిఆర్ఎస్ కు. పాతబస్తీలో ఈ రెండు పార్టీలు తప్పితే మరే ఇతర పార్టీలు పాతబస్తీలో కనీసం కాలు పెట్టజాలవు. ఇది బిజెపికి మింగుడుపడడం లేదు. మజ్లిస్ టార్గెట్ గా బిజెపి ఇవ్వాళ ఆరోపణలు చేసింది.  ​ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. దారుస్సలాంలో కూర్చొని మాట్లాడడం కాదు.. దమ్ముంటే ఎంఐఎం రాష్ట్రమంతటా పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ను సంకలేసుకొని వస్తారో.. కాంగ్రెస్ సహా గుంట నక్కలా పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చూద్దామని కౌంటర్ వేశారు బండి. ప్రస్తుతం బిఆర్ఎస్ మిత్ర పక్షాలలో మజ్లిస్ పార్టీకి తప్పితే మరో పార్టీకి స్థానం లేదు. బిఆర్ఎస్ కంటే ముందు మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. బిజెపితో ఉన్న శత్రుత్వంతో మజ్లిస్ అప్పట్లో  కాంగ్రెస్ తో జత కట్టింది. కాంగ్రెస్ మాత్రమే సెక్యులర్ పార్టీ అని ఓవైసీ కితాబిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ తండ్రి  సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ హాయం నుంచి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బాబ్రీ మసీదు కూలి పోయింది. బిజెపి, సంఘ్ పరివార్ ను దూషించిన మజ్లిస్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో దోషిగా నిలబెట్టలేకపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్ పార్టీకి ఊపిరిపోశారు. మజ్లిస్ కోరిక మేరకు పాతబస్తీలో పునర్ విభజన చేపట్టారు. ఈ పునర్ విభజనతో పాత బస్తీలో మెజారిటీ సీట్లు మజ్లిస్ దక్కించుకుంది. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. అదే సాంప్రదాయాన్ని బిఆర్ఎస్ కొనసాగిస్తుంది. పాత బస్తీలో మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు బలమైన వారు లేకపోవడంతో బిఆర్ఎస్ అధికారంలో వచ్చిన రెండు పర్యాయాలు మజ్లిస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. షాదీ ముబారక్ వంటి స్కీంతో పేద ముస్లి అమ్మాయిలు లక్షలాది మందికి పెళ్ళిళ్లు జరుగుతున్నాయని గాజిబండకు చెందిన హజ్మత్ భాయ్ అంటున్నారు. బిఆర్ఎస్ ను పాతబస్తీ వాసులు ఓన్ చేసుకుంటున్నారు.