ప్రకాశం బ్యారేజీ వద్ద వాటర్ ఏరో డ్రోమ్
posted on Mar 5, 2025 8:39AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి ప్రారంభించిన సీప్లేన్ ప్రాజెక్టుకు సంబంధించి విజయవాడలో వాటర్ ఏరో డ్రామ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో వాటర్ ఏరోడ్రామ్ నిర్మాణానికి కీలక ఒప్పందం చేసుకుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటుకు 20 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు.
కేంద్ర పథకం ఆర్సీఎస్ ఉడాన్ 3.1లో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వాటర్ ఏరోడ్రామ్ నిర్మిచనున్నారు.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదికారులు ఇటీవల విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటు కోసం పరిశీల జరిపారు. హైదరాబాద్ - ప్రకాశం బ్యారేజీ - హైదరాబాద్ మార్గంలో సీ ప్లేన్లను నడిపే విషయంలో ప్రతిపాదనలపై కూడా పరిశీలించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ , ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు ఇటీవలే విజయవాడ ప్రకాశం బ్యారేజీని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన తరువాత ఆ ప్రదేశం వాటర్ ఎరో డ్రోమ్ నిర్ణయానికి అనుకూలమన్న నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటుకు అవసరమయ్యే 20 కోట్ల రూపాయల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
గత ఏడాది నవంబర్‌లో విజయవాడలోని కృష్ణానది పున్నమిఘాట్ నుంచి శ్రీశైలానికి వెళ్లే సీప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్రయల్ రన్ లో చంద్రబాబు, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రమంత్రులు సీప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లారు. తిరిగి సీప్లేన్‌లోనే విజయవాడ పున్నమిఘాట్‌కు వచ్చారు. సీప్లేన్ సర్వీసులను సాధారణ విమాన ఛార్జీల స్థాయికే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి పూర్థి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, గండికోట, కోనసీమ, కాకినాడ, అరకు వ్యాలీ, లంబసింగి, రుషికొండ, తిరుపతి వంటి ప్రాంతాలకు టూరిజం బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. వీటన్నిటినీ కలుపుతూ సీ ప్లేన్ అభివృద్ధి చేస్తే ఏపీ పర్యాటక రంగం పురోగమించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.