షాకిచ్చిన కేసీఆర్ ఫ్లాష్ సర్వే
posted on Nov 14, 2015 10:42AM

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీనేతలు ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రచారంలో మాత్రం తెలంగాణ అధికార పార్టీకి కాస్త ఇబ్బందులు ఎక్కువవుతున్నాయనే చెప్పొచ్చు. ప్రచారం నేపథ్యంలో ఎక్కడికి వెళ్లినా వారికి ప్రజలనుండి ప్రశ్నలు ఎదురవడం.. ప్రజలు వారిని నిలదీయడం వంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. చిన్న నేతలు దగ్గర నుండి పెద్ద నేతల వరకూ ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితి ఎర్పడటం గమనార్హం. దీనికి కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసరడమే నిదర్శనం. దీంతో అసలు వరంగల్ ఎన్నికల్లో విజయంపై ఎలాంటి సందేహం లేదు.. మెజార్టీ మీదనే దృష్టి పెట్టాలనుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న పరిస్థితులపై దృష్టి సారించాలని నిర్ణయించుకుంది. అసలు ఈ పరిస్థితి ఏర్పడటానికి గల కారణాలు గురించి కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే కేసీఆర్ ఓ ఫ్లాష్ సర్వే నిర్వహించారు.
అయితే ఈ సర్వేలో ఫలితాలు చూసి పార్టీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల్లో అసంతృప్తికి ముఖ్యకారణాల్లో ఒకటి.. పత్తికి గిట్టుబాటు ధర లభించకపోవటంగా చెబుతున్నారు. దీనికి తోడు.. ఉప ఎన్నిక జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికం పత్తి పంట పండించే వారు ఉండటం గమనార్హం. అంతేకాదు ఫించన్ల పంపిణీ కార్యక్రమం సరిగా లేకపోవటం.. దళితులకు ఇస్తామని చెప్పిన మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం మీదా గుర్రుగా ఉన్నట్లు తేల్చారు. దీంతో అధికార పార్టీ ప్రజలను బుజ్జగించే పనిలో పడింది. దీనిలో కొన్ని అంశాలు తమకు సంబంధంలేదని ప్రజలకు చెప్పి వారి ఆగ్రహాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు మొదలుపట్టారు. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే వరంగల్ ఉపఎన్నిక ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది.