తార్కిక ముగింపు దిశగా వివేకా హత్య కేసు.. సజ్జల కుట్ర భాష్యం అందుకేనా?

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తాడేపల్లి ప్యాలెస్ పూర్తిగా ఇరుక్కుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవర్న విషయంలో ఇంత కాలం అనుమాలు ఉన్నాయన్న అభిప్రాయం సామాన్యజనంలో ఉండేది. ఇప్పుడు అది దాదాపుగా నివృత్తమైందని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ కేసులో తాడేపల్లి ప్యాలెస్ ఇరుక్కుందన్న విషయం వైసీపీ శ్రేణులకే కాదు.. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి కూడా అవగతమైంది.

అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన రోజు నుంచీ వైసీపీలో ఆరంభమైన గాభరా.. శుక్రవారం (ఫబ్రవరి  3) సీఎం ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ లను సీబీఐ విచారించడంతో మరింత పెరిగింది. అందుకే వారెక్కడా మీడియా కంటబడకుండా, మీడియాతో మాట్లాడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని విచారణ నుంచి బయటకు వచ్చిన వెంటనే వారిని ఏకంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చేర్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ ల విచారణ తరువాత వివేకా హత్య కేసులో ఏవన్ అయిన గంగిరెడ్డిని శనివారం విచారించనుంది. వరుసగా సంభవిస్తున్న పరిణామాలలో వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులు ఉన్నారన్న నమ్మకం బలపడుతూ వస్తోంది. అదే వైసీపీలో కంగారుకు కారణమౌతోంది. 

వివేకా హత్య జరిగిన నాటి నుంచీ గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడం దగ్గర నుంచీ, ఆ తరువాత ఈ హత్య వెనుక ఉన్నది నారా చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించడం వరకూ..ఇక కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టిన తరువాత వివేకా హత్య వెనుక ఉన్నది ఆయన కుమార్తె సునీత, ఆమె భర్తే అంటూ ఆరోపణలు చేయడం వరకూ వైసీపీ ఈ కేసులో లోతుల్లెకి వెళ్లి దర్యాప్తు జరగకుండా అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. పన్నని కుట్ర లేదు. ఏకంగా సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు, కడపలో వారికి బెదరింపుల వరకూ ఎంత చేయాలో అంతా చేసింది.

అయితే పట్టు వదలకుండా వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి చేసిన న్యాయపోరాటం కారణంగా కేసును ఏపీ నుంచి తెలంగాణకు మార్చిన తరువాత.. దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇన్నేళ్లుగా ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. కనీసం విచారణకు కూడా రావలసిన అవసరం లేకుండా మేనేజ్ చేసుకోగలిగిన అవినాష్ రెడ్డి అనివార్యంగా సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టిన సీబీఐ.. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కు సన్నిహితంగా మెలిగే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను పిలిపించుకుని విచారించింది. ఇప్పుడు వెంటనే గంగిరెడ్డిని విచారించడంతో అందరి చూపులూ తాడేపల్లి ప్యాలెస్ వైపే అనుమానంగా చూస్తున్నాయి.

వివేకా హత్య వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో వైసీపీ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఈ కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందంటూ రాద్ధాంతం చేయడానికి సిద్ధపడుతోంది. ఇందుకు తొలి పలుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంటే వచ్చింది. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.  వివేకా హత్య కేసులో వైసీపీ ఎన్ని యూటర్న్ లు తీసుకుందో లెక్కే లేదు. గొడ్డలి పోటును గుండెపోటుగా నమ్మించడానికి చేసిన ప్రయత్నం నుంచి  చంద్రబాబు,  వివేకా కుమార్తె, అల్లుడులపై ఆరోపణల వరకూ ఎంత చేయాలో అంతా చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో వైసీపీ పెద్దల ప్రమేయం బయటపడటం ఖాయమని తేలిన తరువాత ఇక ఇప్పుడు అనివార్యంగా కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అక్రమాస్తుల కేసులు జగన్ అరెస్టయిన సందర్బంగానూ వైసీపీ దాదాపుగా ఇటువంటి ఆరోపణలే చేసిన సంగతి తెలిసిందే.   తెలుగుదేశం, కాంగ్రెస్ లు కుట్ర చేశాయని జగన్ అప్పట్లో ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఇంత కాలం అనుమానాలుగా ఉన్న విషయాలపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జోరందుకున్న తరువాత స్పష్టత వస్తోంది.  అదే వైసీపీని గాభరాపెడుతోంది. అందుకే కుట్ర అంటూ గగ్గోలు పెడు తోంది.