బీఆర్ఎస్ తో దోస్తానీకి ఎంఐఎం చెల్లుచీటీ?.. అందుకే అసెంబ్లీలో అక్బరుద్దీన్ విమర్శల బాణాలు?

 ఎనిమిదేళ్ల జిగిరీ దోస్తానీకి తెరపడిందా? ఎంఐఎం, బీఆర్ఎస్ ల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నుంచీ కేసీఆర్, ఒవైసీల మధ్య మైత్రి కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ గా ఉన్నంత కాలం ఇరు పార్టీల మధ్యా పొరపచ్చాల్లేవు. ఎన్నికల పొత్తు లేకపోయినా.. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ఇరు పార్టీల మధ్యా బహిరంగ అవగాహనే ఉండేది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఆ అవగాహన మేరకే అభ్యర్థులను రెండు పార్టీలూ నిలబెట్టాయి. అయితే ఆ మైత్రి ఇప్పుడు మాయమైంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ ఇరు పార్టీల మధ్యా విభేదాలు ఆరంభమయ్యాయనీ, అవి నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్నాయనీ పరిశీలకులు అంటున్నారు.

అయితే తాజా బడ్జెట్ సమావేశాలలో ఆవి ఒక్కసారిగా బయటపడ్డాయి.  అసెంబ్లీలో శనివారం (ఫిబ్రవరి 4)న బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది.   ఎంఐంఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో హామీలు ఇస్తారు.. తప్ప వాటిని అమలు చేయరని  విమర్శించారు. సమస్యలు చెప్పుకుందామంటే సీఎం, మంత్రుల దర్శనమైనా మాకు కలగడం లేదని దుయ్యబట్టారు. మీకు మమ్మల్ని కలవడం ఇష్టం లేకపోతే..   మీ చెప్రాసిని   చూపిస్తే వారినైనా కలిసి మా సమస్యలపై విన్నవించుకుంటామని ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  పాతబస్తీలో మెట్రో సంగతి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని ఒవైసీ  నిలదీశారు.

ఉర్ధూ రెండవ అధికారిక బాష అయినా అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల   రాష్ట్రానికి ఒరిగిందేమిటని ఒవైసీ అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీకి మద్దతు ఇవ్వొద్దని అప్పట్లో నెత్తీ నోరు బాదుకుని చెప్పినా అప్పటి టీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు.  దీంతో ఒవైసీ మాటలకు మంత్రి కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఒవైసీ చెప్పిన మాటలన్నీ వాస్తవం అయిపోవన్నారు. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కోరుతోందనీ, అది సాధ్యం కాదనీ కుండబద్దలు కొట్టారు.

అసలు బీఏపీ సమావేశానికి రాకుండా ఇప్పుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇష్టారీతిగా మాట్లాడి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఇంత కాలం పాలు, నీళ్లలా కలిసి ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్యా అసెంబ్లీ వేదికగా మాటలయుద్ధం సాగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇరు పార్టీల మధ్యా మైత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు సిద్ధపడినప్పుడే తెగిపోయిందని పరిశీలకులు అంటున్నారు.
ఆయన ఆ నిర్ణయం తీసుకున్న క్షణమే  తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్)   మిత్రపక్షం  ఎంఐఎం గులాబీ పార్టీకి తలాక్  చెప్పాలనే నిర్ణయానికి వచ్చిందంటున్నారు. నిజానికి ముందు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఎంఐఎం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ మలి విడత ఉద్యమాన్నీ వ్యతిరేకించింది.  రాష్ట్ర విభజ జరిగితే  బీజేపీ బలపడుతుందన్న ఏకైక  కారణంతోనే ఎంఐఎం అధ్యక్షుడు,  హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్  లోపలా వెలుపలా కూడా పలు సందర్భాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించారు. అయితే ఆయన వ్యతిరేకతను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన జరిగిపోయింది.

ఆ తరువాత అనూహ్యంగా  కేసీఆర్, ఒవైసీ జిగిరీ దోస్తులై పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ వేదికగానే, ‘అవును. ఎంఐఎం మా మిత్ర పక్షం’ అని ప్రకటించారు కూడా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసినా, ఫలితాలు వచ్చిన తర్వాత  మళ్లీ ఒకటై పోయారు. చివరకు మొన్నటికి మొన్న సెప్టెంబర్ 17న  అనివార్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపవలసి వచ్చినప్పుడు కూడా  తెలంగాణ విమోచన దినాన్ని, విమోచన దినంగా కాకుండా ఒవైసీ సూచించిన విధంగా జాతీయ సమైక్యతా దినంగా కేసీఆర్ జరిపించారు. అయితే  ఇప్పటికే జాతీయ రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత ఒవైసీ  కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించలేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వైపు దృష్టి సారిస్తే తెలంగాణలో   తెరాస(బీఆర్ఎస్) గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని ఒవైసీ భావిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి కూడా  కేసీఆర్ తీరే కారణమని ఒవైసీ గుర్రుగా ఉన్నారు.  అంతే కాకుండా రాష్ట్రంలో కాషాయ దళం బలోపేతం కావడానికి కేసీఆరే ఉద్దేశపూర్వకంగా అవకాశం ఇస్తున్నారన్న అనుమానాలు కూడా ఆయనలో గూడుకట్టుకుని ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  

ఇంత కాలం తెరాసతో ఉన్న రాజకీయ అవగాహన కారణంగా  ఎంఐఎం ఇంతవరకూ పాత బస్తీలోని ఏడు అసెంబ్లీ,  హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక ఇప్పుడు తెరాస బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ పార్టీకి దూరం జరగడమే కాకుండా   రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఇతర జిల్లాలు, నియోజక వర్గాల నుంచి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ తెరాసను కనుమరుగు చేసిన తరువాత.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నిర్ణయానికి ఎంఐఎం వచ్చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఎంఐఎం కేవలం పాత బస్తీకే పరిమితమైతే   బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత  తమ గొంతు నొక్కేస్తుందని,  అందుకే పాతబస్తీకి ఆవల కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ.. భవిష్యత్ లో ఒక వేళ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని  ఎంఐఎం అధినేత భావిస్తున్నారు. 

ఈ నేపధ్యంలోనే ఉమ్మడి అధిలాబాద్, నిజాబాబాద్, కరీంనగర్ జిల్లాలలోని ముస్లిం ఆధిపత్యం ఉన్న నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని ఎంఐఎం నాయకత్వం నిర్ణయానికి వచ్చి నట్లు తెసుస్తోంది. అలాగే, ఓబీసీలు, దళితులను కలుపుకుని రాష్ట్రంలో విస్తరించే, ప్రణాళికకు ఒవైసీ పదును పెడుతున్నారు. అలాగే  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచి హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎంఐఎం కాంగ్రెస్తో చేతులు కలిపి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందన్నది కూడా ఎంఐఎం అధినేత వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు.  

అందుకే ఎంఐఎం బీఆర్ఎస్ తో మైత్రికి చెల్లుచీటీ పాడేసిందనీ, ఆ ఫలితమే నేడు అసెంబ్లీలో ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ సర్కార్ పై అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారని అంటున్నారు.