ఈ అబ్బాయి చాలా మంచోడు.. అల్లుడికి అత్త కితాబు

సొంత అన్న కొడుకే  ముఖ్యమంత్రిగా ఉన్నారు. హత్య జరిగి నాలుగేళ్ల అయినా... ఆ హత్యకు స్కెచ్ వేసిన సూత్రదారులు వీళ్లేనంటూ.. పాత్రదారుల్లో ఒకరు అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట స్వయంగా వాంగ్మూలం ఇచ్చినా.. నిందితులు ఇంత వరకు అరెస్ట్ కాలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సైతం.. ఈ కేసును ఛేదించ లేక.. నిసత్తువతో చతికిలి పడిపోయినట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే.. అత్యంత దారుణంగా హత్యకు గురైన వివేకానందరెడ్డికి బంధాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు అంటగడుతూ.. ఆయన క్యారెక్టర్ అసిసినేషన్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు.  వైఎస్  ఫ్యామిలీ నుంచి ఇలా ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వచ్చి.. తమ తమ అభిప్రాయాలు వ్యక్తీకరిస్తున్నారు. దీంతో వివేకా హత్య కేసు.. ఓటీటీలో రిలీజ్ అయిన ఓ పెద్ద సైజ్ వెబ్ సిరీస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందనే ఓ అభిప్రాయం  ఉమ్మడి కడప జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది.

తాజాగా వైయస్ ఫ్యామిలీ నుంచి వైయస్ వివేకా సొంత సోదరి వైయస్ విమలమ్మ.. మీడియా ముందుకు వచ్చి గొంతు సవరించుకొన్నారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి అమాయకుడని.. చిన్ననాటి నుంచి మైల్డ్‌గా ఉండేవాడని.. చెప్పుకొచ్చారు. అలాగే ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రదారులు మాత్రం ప్రస్తుతం నడిరోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతోన్నారని.. ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేని వారు మాత్రం జైళ్లలో   మగ్గుతోన్నారని ఆమెఆవేదన వ్యక్తం చేశారు. 

మరో వైపు తన తండ్రి హత్య కేసులో.. తమ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని... గతంలో  వివేకా కుమార్తె వైయస్ సునీత స్వయంగా స్పష్టం చేశారని.. కానీ ఆ తర్వాత.. అదే  సునీత.. మాట మార్చారంటూ  విమలమ్మ పేర్కొనడమే కాదు, సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. అయితే  విమలమ్మ వ్యాఖ్యలపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

అంతే కాదు విమలమ్మకు ఈ సందర్బంగా వారు పలు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో వివేకా హత్య కేసులో..అవినాష్ రెడ్డి అమాయకుడు అయితే.. సీబీఐకి ఆయన ఎందుకు భయపడుతున్నారని.. అలాగే సీబీఐ విచారణకు రమ్మంటే.. ఆయన ఎందుకు ముఖం చాటేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఓ వేళ ఈ హత్య కేసులో  అవినాష్ నిర్దోషి అయితే.. సీబీఐ విచారణకు హాజరై... తన నిర్ధోషత్వన్ని నిరూపించుకోంటే సరిపోతోంది కాదా అని కడప జిల్లా వాసులు ప్రశ్నిస్తారు. మరో వైపు మీ మరో మేనల్లుడు వైయస్ జగన్ ప్రభుత్వమే కదా.. ఆంధ్రప్రదేశ్ ‌రాష్ట్రంలో అధికారంలో ఉంది. అలాంటప్పుడు వైయస్ వివేకా హత్య కేసును త్వరితగతిన ఛేదించాలంటూ.. సీబీఐపై ఆయన కానీ.. ఆయన ప్రభుత్వం కానీ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక   సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయన్నారు కదా? ఆ దుష్ట శక్తులు ఎవరో ప్రకటించాలని ఈ సందర్భంగా వైయస్ విమలమ్మను వారు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా మీ ప్రియమైన సోదరుడి కుమార్తె   సునీత ఎందుకు మాట మార్చారో మీకు తెలియదా? అంటూనే.. తన తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో తేల్చాలంటూ... సోదరుడు ప్లస్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్దకు స్వయంగా వెళ్లి సునీత విజ్జప్తి చేయగా...  సీఎం వైయస్ జగన్ నుంచి వచ్చిన సమాధానం.. విన్న ఆమె.. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకొని.. ఏం చేసిందో.. ఏమిటో మీకు తెలియదా? అంటూ వైయస్ విమలమ్మకు ఉమ్మడి కడప జిల్లా వాసులు తలంటుతోన్నారు. 

అదీకాక వైయస్ అవినాష్ వెనుక సీబీఐ పడుతోందంటూ విమలమ్మ వ్యాఖ్యానించడం పట్ల జిల్లా వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పిన సాక్ష్యమే కాదు.. వైయస్ వివేకా హత్య జరిగిన సమయానికి ముందు ఆ తర్వాత  వైయస్ అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్‌ డేటాపై సీబీఐ ఆరా తీయడం.. ఆ క్రమంలో పలువురిని పిలిచి విచారించడం... ఆ తర్వాత ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రదారులు వీరేనంటూ సీబీఐ రంగంలోకి దిగిందని... అంతేకానీ వైయస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలనే తాపత్రయం సీబీఐకి ఎందుకు ఉంటుందని సదరు జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు.  

ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత ఇంటి మనిషి ఇలా హత్య కావింప బడితే.. ఈ కేసులో ఆయన స్పందన.. అదీ ముఖ్యమంత్రిగా నేటికి స్పందించకపోవడం పట్ల.. జిల్లా వాసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో అసలు సిసలు దోషులను ఏ మాత్రం విడిచిపెట్టవద్దంటూ సీఎం వైయస్ జగన్ మీద మీరైనా తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని జిల్లా వాసులు మనస్పూర్తిగా కోరుతున్నారు. 

ఏదీ ఏమైనా వైయస్ వివేకాను అత్యంత దారుణంగా హత్య చేయడం.. తొలుత ఆయనది గుండెపోటు అని చెప్పడం.. ఆ తర్వాత హత్య అని తేటతెల్లం కావడం.. అనంతరం ఈ హత్య కేసులో చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో ఈ నాలుగేళ్లగా వైయస్ సునీతకు అందని న్యాయం... వైయస్ ఫ్యామిలీలోని ఇటువంటి పెద్ద వాళ్ల ప్రార్థనలతో.. ఈ వైయస్ వివేక హత్య కేసులో తప్పించుకొని.. బయట విచ్చలవీడిగా తీరుగుతోన్న అసలు సిసలు సూత్రదారులు ఎవరో వారిని కనిపెట్టి పట్టుకొని.. వారికి కఠిన శిక్ష పడేలా చేయడం ద్వారా ఈ కేసు విచారణకు శుభం కార్డు పడితే అదే తమకు ఇది అని కడప జిల్లా వాసులు క్లియర్‌ కట్‌గా స్పష్టం చేస్తుండడం విశేషం.