ఆ ఇద్దరి దారెటు? ఈటల రహస్య భేటీ ఎందుకు?

ఇంచుమించుగా నాలుగైదు నెలలుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు వార్తల్లో వ్యక్తులుగా వెలిగిపోతున్నారు. ముఖ్యంగా, గత నెలలో ఆ ఇద్దరినీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచీ, ఆఇద్దరి చుట్టూనే రాష్ట్ర రాజకీయం చక్కర్లు కొడుతోంది. అప్పటి నుంచి ఆ ఇద్దరు ఏ పార్టీలో చేరుతున్నారు? అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తూనే వుంది. ఓ వంక బీజేపీ, మరో వంక కాంగ్రెస్ ఆ ఇద్దరిని తమ వైపుకు తిప్పుకునేందుకు  ప్రయత్రాలు చేస్తున్నాయి.  ఢిల్లీ  పెద్దలు మొదలు రాష్ట్ర నేతలు వరకు ఈ ప్రయత్నాలు చేశారు.

కొంతకాలం క్రితం   కేంద్ర హోం మంత్రి అమిత షాతో  పొంగులేటి భేటి అయినట్లు వార్తలొచ్చాయి.. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ సభ్యులు పొంగులేటి, జూపల్లి జోడీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆ తర్వాత బీజేపీ చేరికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్ తో పాటుగా మరికొందరు బీజేపీ నేతలు పొంగులేటి ఇంటికెళ్ళి బీఆర్ఎస్ బహిష్కృత నేతలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. బీజేపీలో కి రావలసిందిగా ఆహ్వానించారు. అయితే, ఆ ఇద్దరు నేతలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎవరికీ వుందో తేలిన తర్వాతనే తమ నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అయితే ఓక దశలో వారు బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలొచ్చాయి.  అయితే ఇంతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీలందరు మళ్ళీ రండని పిలుపు ఇవ్వడంతో ఆ ఇద్దరు కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో గురువారం(మే 25) మాజీ మంత్రి, బీజేపీ చేరికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్  ఆ ఇద్దరు నాయకులతో రహస్యంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ శివార్లలో ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్, పొంగులేటి, జూపల్లి మధ్య రహస్య సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో ఏమి చర్చించారు, ఏమి నిర్ణయించారు అనేది స్పష్టంగా తెలియక పోయినా, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినా, లోక్ సభ ఎన్నికల నాటికీ, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయమని, ఇందుకు సంబంధించి, బీఆర్ఎస్, కాంగ్రెస్ జాతీయ నాయకుల మధ్య కుదిరిన ఒప్పదం తాలూకు వివరాలను ఈటల ఆ ఇద్దరి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసివచ్చిన ఈటల ఢిల్లీ పరిణామాలను పొంగులేటి, జూపల్లికి వివరించారాని అంటున్నారు. అయితే, ఆ ఇద్దరు నాయకుల స్పందన ఏమిటనేది తెలియవలసి ఉందని అంటున్నారు.  అదలా ఉంటే అనుచరులు, అనుయాయులు, కనీసం సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకుండా అత్యంత రహస్యంగా ఈ భేటీని జరగడంతో ఈ సమావేశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇంత సీక్రెట్‌గా సమావేశమవడానికి గల కారణాలు ఏంటనే దానిపై చర్చ మొదలైంది. అలాగే  పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఇందులో భాగంగానే ఈటలను రహస్యంగా కలిశారా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.  మరి నిజంగా వీరిద్దరినీ ఈటల బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా? లేక ఈటలనే తమ కొత్త పార్టీలోకి వారిరువురూ ఆహ్వానించారా? అనే ఆసక్తికర చర్చ కూడా తెరమీదకు వచ్చింది.