చంద్రబాబు, లోకేష్ పై కేసు

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో ఏపీ రాజకీయాలు రచ్చగా మారాయి. ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతున్నారు నేతలు. వ్యక్తిగత దూషణలు, పరస్పర సవాళ్లతో కాక రేపుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై శనివారం కేసునమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికలో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో అనుచిత పోస్ట్ చేశారంటూ వాళ్లపై కేసు పెట్టారు.

ఫేస్‌బుక్‌ ఖాతాలో అనుచిత పోస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఎస్పీ ఎస్టీ కేసు క‌ట్టాల‌ని వైసీపీ నేతలు ఏపీ డీజీపీని శుక్రవారం కోరారు. చంద్రబాబు, లోకేష్ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు, లోకేష్‌లపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ కింద శనివారం కేసు నమోదు చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేయగా. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేశారు.

ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపైనా కేసు నమోదు చేసింది సీఐడీ. తిరుపతి బైపోల్‌ సందర్భంగా.. ఈనెల 7న దేవినేని ఉమ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆ ప్రెస్‌ మీట్‌లో ఆయన చూపించిన డిజిటల్‌ డాక్యుమెంట్‌ ఫోర్జరీ అంటూ సీఐడీ కేసు బుక్‌ చేసింది. ఓ ట్యాబ్‌లో ఆయన చూపించిన వీడియోని ఫోర్జరీ అని.. అది చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.