వరద బాధితులు రెండున్నర లక్షలమంది!
posted on Sep 1, 2024 10:14PM
విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2.76 లక్షల మంది వరద బాధితులు ఉన్నారని, వీరందరికీ ఆహారం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆదివారం రాత్రి విజయవాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘సింగ్‌నగర్‌లో వరద పరిస్థితిని పరిశీలించాను. బాధితులతో మాట్లాడాను. వరద నీరు మరింత పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాం. బుడమేరుకు గండ్లు పడి వరదనీరు పోటెత్తింది. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలోనే ఇప్పుడు భారీ వర్షాలు పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా వరదనీరు ముంచుకొస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీరు విజయవాడకు చేరుతోంది. బుడమేరు నిర్వహణను జగన్ ప్రభుత్వం ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. గండ్లు పడిన ప్రాంతాల్లో మరమ్మతులు ఎంతమాత్రం చేయలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడి వరద పరిస్థితిని వివరించాను. 6 హెలికాప్టర్లు, 40 పవర్ బోట్లు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లను పంపిస్తామని అమిత్ షా చెప్పారు. అడిగిన వెంటనే సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.