మాయలఫకీరు విజయసాయి.. ఆ వ్యూహంతోనే రాజీనామాస్త్రం!

విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. విజయసారిరెడ్డి ఇంత హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటన్నదానిపైనే రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. కేసుల నుంచి తప్పించుకోవడానికే వ్యూహాత్మకంగా విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం అంటున్నారన్న వాదన బలం పుంజుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే పలువురు తెలుగుదేశం నేతలు విజయసాయిరెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసుల నుంచి తప్పించుకోజాలరని అంటున్నారు. ఇదే విషయంపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీనామా చేసి, రాజకీయాలనుంచి వైదొలగినంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనీ, విజయసాయి చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. విజయసాయి హయాంలో  విశాఖ వాసులు పడిన ఇక్కట్లు, విశాఖలో జరిగిన విధ్వంసం, దాడులు అందరికీ తెలుసునన్న గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే విజయసాయి రాజీనామాతో ఒక విషయం మాత్రం ప్రస్ఫుటమైందనీ, వైసీపీ అనేది మునిగిపోయే నావ అన్నది తేటతెల్లమైందని గంటా అన్నారు. వైసీపీ మునిగిపోయే నావ అన్న విషయం తాను ఎప్పుడో చెప్పాననీ, ఇప్పుడది నిజం కాబోతోందని పేర్కొన్నారు. 

ఇక అమరావతి బహుజన సమాఖ్య అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అయితే విజయసాయిని ఒక మాయల ఫకీరుగా అభివర్ణించారు. ఆయన ఏదైనా చేయగలరు, ఎవరినైనా నమ్మించగలరని పేర్కొన్నారు. విజయసాయి రాజీనామాను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఆమోదించిన నేపథ్యంలో శనివారం (జనవరి 25) మీడియాతో మాట్లాడిన బాలకోటయ్య.. ఏదో బోధి వృక్షం కింద జ్ణానోదయం అయ్యింది అనుకోవడానికి విజయసాయి బుద్ధుడు కాదన్నారు. ఇక తన భవిష్యత్ వ్యవసాయమే అని విజయసాయి చెప్పడాన్ని కూడా బాలకోటయ్య ఎద్దేవా చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి విదేయుడైన ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయికి వ్యవసాయం అంటే ఏం తెలుసునని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పార్టీలోనూ, ఆయన కేసుల్లోనూ కూడా ఏ2గా ఉన్న విజయసాయి వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.  అధికారంలో ఉన్నప్పుడు తనంతటి వాడు లేడని విర్రవీగి, అధికారం పోగానే పలాయనం చిత్తగించటం విజయసాయి నైజమని విమర్శించారు.  ఆయన రాజకీయ సన్యాసం అనడం వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాని చట్టం నుంచి తప్పించుకోగలననుకోవడం విజయసాయి భ్రమ మాత్రమేనని బాలకోటయ్య అన్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu