విజయమ్మ.. జగన్.. మధ్యలో సజ్జల!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి తల్లి విజయమ్మ  బుధవారం (జూన్ 7) అమరావతిలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. కుమారుడి ఇంటి వైపు కనీసం కన్నెత్తి చూడకుండా విజయమ్మ సజ్జల నివాసానికి వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అ యితే వైయస్ విజయమ్మ  సజ్జల నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది. అయితే  సాక్షాత్తూ ముఖ్యమంత్రి తల్లి అయిన విజయమ్మ స్వయంగా కుమారుడి కింద పని చేసే ఉద్యోగి లాంటి సజ్జల నివాసానికి వెళ్లడం తల్లీ కుమారుల మధ్య విభేదాలున్నాయనీ, కనీసం రాకపోకలు కూడా లేవని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయ్యింది.

అయినా వాస్తవానికి విజయమ్మ స్థాయికి ఆమె కాకితో కబురంపితే రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిన స్థాయి సజ్జలది. అయితే  విజయమ్మే స్వయంగా సజ్జల నివాసానికి వెళ్లడమేమిటన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.   దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి,  ప్రస్తుత సీఎం  జగన్‌ తల్లి, అధికార వైపీసీ మాజీ  గౌరవ అధ్యక్షురాలు అయిన  ఆమె.. సజ్జల ఇంటికి వెళ్లడం.. ఆ సమయంలో సజ్జల లేకపోవడం.. మహానేత, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్ విజయమ్మని అవమానపరచడమేనని వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ముందస్తుగా సజ్జలకు సమాచారం ఇచ్చే.. హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటారని.. అలాంటి ఆమెను.. ఇలా అగౌరవపరచడం సజ్జల అహంకారం తప్ప మరోటి కాదని అంటున్నారు.  అయినా మహానేత భార్య  వైయస్ విజయమ్మ.. ఎందుకు సజ్జల ఇంటికి వెళ్లారనే అంశంపై వారు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.  

అయితే అమరావతి వరకూ.. అదీ సజ్జల ఇంటి వరకు వెళ్లిన ఆమె... ఆ పక్కనే తాడేపల్లిలో ఉన్న తన కుమారుడు, సీఎం జగన్ ఇంటికి వెళ్లక పోవడం ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  జగన్ అధికార పీఠంపై కూర్చొబెట్టేందుకు తల్లిగా విజయమ్మ, చెల్లిగా  షర్మిల.. ఎంతగా కష్టపడాలలో అంతగా కష్టపడ్డారని.. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ వీరిద్దరినీ జగన్ దూరం పెట్టారని కూడా ఈ  సందర్భంగా  పరిశీలకులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ ఫ్యామిలీలో వరుసగా చోటు చేసుకొన్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు. 

మరోవైపు వైయస్ జగన్ సొంత చిన్నాన్న  వివేకా అత్యంత దారుణంగా హత్యకు గురై.. నాలుగేళ్ల దాటిపోయిందని... ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. మాత్రం ప్రధాన నిందితులంటూ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం.. ఆ క్రమంలో వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ కావడం..  అవినాష్ రెడ్డి అయితే కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందడం.. తదితర అంశాలను ఈ సందర్భంగా వైఎస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇంకోవైపు తన తండ్రి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ  వివేకా కుమార్తె వైయస్ సునీత  వైయస్ అవినాష్ రెడ్డి పొందిన ముందస్తు బెయిల్  ను సవాల్ చేస్తూ మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పరిస్థితులలో జగన్ తల్లి విజయమ్మ కుమారుడిని కనీసం పలకరించకుండా.. ఆ పక్కను ఉన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు నివాసానికి వెళ్లడం వెనుక ఏదో గట్టి కారణమే ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

అదీకాక వైయస్ జగన్, ఆయన సోదరి వైయస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు  సజ్జల రామకృష్ణారెడ్డి రాయబారం   చేస్తున్నారనే ఓ చర్చ  వైసీపీ వర్గాల్లో  హల్ చల్ చేస్తోంది.  దీంతో విజయమ్మ.. సజ్జలతో ఏ అంశాలపై చర్చించేందుకు  ఆయన నివాసానికి వైయస్ విజయమ్మ వెళ్లి ఉంటారన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.