అజ్ణాతంలో విడదల రజిని.. అరెస్టు భయమే కారణమా?
posted on Sep 9, 2024 7:06AM
తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. వైసీపీలోకి జంప్ చేసిన విడదల రజని ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికై అవినీతి వటవృక్షంగా ఎదిగారు. సైబరాబాద్ మొక్కనంటూ తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విడదల రజనీ.. వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కొద్దికాలంకే తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఆ తరువాత అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. తద్వారా వైసీపీ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండున్నరేళ్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అధికారంలో ఉన్నసమయంలో విడుదల రజనీ, ఆమె అనుచరులు పెద్దెత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటం, ఆమె మంత్రిగా ఉండటం వల్ల ఆమె అవినీతిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విడుదల రజనీ అవినీతి అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో తెగ హడావుడి చేసిన ఆమె.. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి పెద్దగా ప్రజల్లోకి రావడం లేదు. గత నెల రోజుల నుంచి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు రజనీ అందుబాటులో లేరని వైసీపీ నేతలే చెబుతున్నారు. అవినీతి గుట్టు వీడుతుండటంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంలో నమోదైన కేసులూ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడిచేశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులకు పిర్యాదు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసుపై దృష్టి సారించింది.. ఈ క్రమంలో మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కూటమి ప్రభుత్వం దూకుడుతో గత ఐదేళ్లు పొలిటికల్ స్ర్కీన్‌పై ఓ వెలుగు వెలిగిన నేతలు.. ఉన్నపళంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేశ్ వంటివారు అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోగా, మాజీ మంత్రి విడదల రజిని కూడా వారి బాటనే అనుసరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ హయాంలో విడదల రజనీ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. అంతేకాక.. ఇటీవల కాలంలో రజనీ అవినీతి అక్రమాలపై పోలీస్ స్టేషన్‌లలో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆ కేసులపై దృష్టి సారించిన అధికారులు.. రజనీని త్వరలో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.
2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రజనీ.. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత క్రమంలో రజనీని పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఆమె నియోకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక వైసీపీ నేతలు కూడా గతంలో జగన్ మోహన్ రెడ్డికి రజనీపై పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా జగన్ చూసీ చూడనట్లు వదిలేయడంతో విడదల రజనీ మరింత రెచ్చిపోయారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఈ క్రమంలో చిలకలూరి పేట నియోజకవర్గంలో ఆమెపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.
జగన్ నిర్వహించిన సర్వేలో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి మరోసారి రజనీని పోటీకి దింపితే ఆమె ఓడిపోవటం ఖాయమని తేలింది. దీంతో 2024 ఎన్నికల్లో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. అయితే, ఆ ఎన్నికలలో రజనీ ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. చిలకలూరిపేటలో విడదల రజనీ భూ దందా వెలుగు చూసింది. జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటీ 16 లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ బాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారని తెలిసింది.
ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని తన వద్ద విడదల రజనీ ఆరు కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి రాజేశ్ నాయుడు ఆరోపించారు. గతంలో కొంత మొత్తం తిరిగి ఇచ్చేయగా.. ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ఆ డబ్బు కోసం రాజేశ్‌నాయుడు చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజేష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన రజనీకి గట్టి షాకిచ్చేందుకు రెడీ అవుతున్నారట. మరో వైపు చిలకలూరిపేట స్టోన్ క్రషర్ యజమానులు కొందరు మాజీ మంత్రి విడుదలపై తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. క్రషర్లు నడపాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని రజిని డిమాండ్ చేశారని, లేదంటే 50 కోట్ల జరిమానా విధించేలా విజిలెన్స్ కేసులు నమోదు చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీంతో విడుదల రజినీపై చర్యలకు పోలీసులు రంగం సిద్ధంచేస్తున్నారని ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. తర్వాత జైలు కెళ్లే వైసీపీ నేత మాజీ మంత్రి రజనీ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు.. విడుదల రజనీ మాత్రం తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలో ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద రజనీ అవినీతి, అక్రమాల గుట్టు రట్టౌతుండటంతో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.