కౌ హగ్ డే ..వాలంటైన్స్ డే కేంద్రం కొత్త థీమ్!

ఆవులను ప్రేమించాలి. గోమాతకు రక్షణ కల్పించాలి. గోవధకు వ్యతిరేకంగా దేశంలో ఎన్నో ఉద్యామాలు జరిగిన చరిత్ర ఉంది. దేశంలో గో రక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు మోడీ సారథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వాలంటైన్స్ డేకు కొత్త థీమ్ ను ప్రతిపాదించింది. వాలంటైన్స్ డేను హగ్ ఏ కౌ థీమ్ తో నిర్వహించుకోవాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ పేర్కొంది.

ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారన్నసంగతి విదితమే. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని భారతీయ సంస్కృతిలో విడదీయరాని బంధం ఉన్న గోవులకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్వహించుకోవాలని ప్రజలకు కేంద్ర పశుసంవర్ధక శాఖ కోరింది.

ప్రేమికుల దినోత్సవం రోజున ప్రతి వారూ ఒక గోవును హగ్ చేసుకుని దేశ సంస్కృతికి పెద్ద పీట వేయాలని కోరింది. గోమాతను పూజిస్తే శుభం జరుగుతుందన్న భారత సంస్కృతికి అద్దంపట్టేలా ఈ ఏడు వాలంటైన్స్ డేను కౌ హగ్ డేగా పాటించాలని కోరింది.