కాంగ్రెస్ చెబుతుంటే.. మోదీ చేస్తున్నారా?

కొవిడ్ వ్యాక్సిన్స్. ప్ర‌స్తుత స‌మ‌యంలో ప్ర‌పంచానికి మోస్ట్ వాంటెడ్‌. టీకా ఉత్ప‌త్తిలో భార‌త్ ప్ర‌ముఖ స్థానంలో నిలుస్తోంది. దేశ ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌పంచ దేశాల‌కూ స‌ప్లై చేస్తోంది. ఇది మ‌న ఉదార‌త అంటోంది కేంద్రం. అది మీ ఉదాసీన‌త అని విమ‌ర్శిస్తోంది కాంగ్రెస్‌. అందుకే, వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం, ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిపై బీజేపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య డైలాగ్‌ వార్ న‌డుస్తోంది. 

వ్యాక్సిన్‌ ఎగుమ‌తుల‌పై కొంత‌కాలంగా కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర విధానాన్ని రాహుల్‌గాంధీ త‌ప్పుబ‌ట్టారు. వెంట‌నే ఎగుమ‌తులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ విమ‌ర్శించిన కొన్ని రోజుల‌కే కేంద్రం వ్యాక్సిన్ ఎగుమ‌తుల‌ను ర‌ద్దు చేయ‌డం ఆస‌క్తిక‌రం. 

అంతేకాదు, 45 ఏళ్ల పైబ‌డిన వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ ఇవ్వ‌డాన్ని రాహుల్‌గాంధీ నిల‌దీశారు. దేశ ప్ర‌జ‌లంద‌రికీ వెంట‌నే వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాల‌ని డిమాండ్ చేశారు. విచిత్రంగా.. రాహుల్ వ్యాఖ్య‌ల త‌ర్వాతే కేంద్రం త‌న విధానాన్ని మార్చుకుంది. 18 ఏళ్ల పైబ‌డిన వారంద‌రికీ మే నెల 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. దేశంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెంచేందుకు సైతం కంపెనీల‌కు ఆర్థిక సాయం చేసేలా నిర్ణ‌యం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర నియంత్ర‌ణ‌లో మాత్ర‌మే ఉన్న వ్యాక్సిన్ స‌ప్లై.. ఇక‌పై రాష్ట్రాలు, బ‌హిరంగ మార్కెట్లోనూ అందుబాటులో ఉండేలా కేంద్రం పాల‌సీ మార్చుకుంది. ప‌లు రాష్ట్రాలు త‌మ ద‌గ్గ‌ర వ్యాక్సిన్ నిల్వ‌లు లేవంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశాక‌గానీ కేంద్రం దిగిరాలేదు. టీకాలు లేక తెలంగాణ స‌ర్కారు ఏకంగా ఒక రోజు వ్యాక్సినేష‌న్‌ను ఆపేయ‌డం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. అటు, కాంగ్రెస్ విమ‌ర్శ‌లు.. ఇటు రాష్ట్రాల నుంచి ఒత్తిడితో మోదీ న‌ష్ట నివార‌ణా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే, ఆ చ‌ర్య‌ల‌న్నీ రాహుల్‌గాంధీ విమ‌ర్శ‌ల త‌ర్వాతే తీసుకోవ‌డం కాక‌తాళీయ‌మో.. లేక‌..?

మ‌రోవైపు, రాహుల్‌లానే ప్రియాంక గాంధీ సైతం విమ‌ర్శ‌ల్లో ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు. సూటిగా, ఘాటుగా మోదీపై విమ‌ర్శ‌లు చేయ‌డంలో దిట్ట ఆమె. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ధానిపై హాట్ కామెంట్స్‌తో విరుచుకుప‌డుతుంటారు. తాజాగా, దేశంలో వ్యాక్సిన్‌, ఆక్సిజ‌న్ కొర‌త‌పై మోదీని ఏకిపారేశారు ప్రియాంక‌. మూడు నెలల్లో భార‌త్ నుంచి 6 కోట్ల కొవిడ్ టీకాలు ఎగుమ‌తి అయ్యాయ‌న్నారు ప్రియాంక‌. 

"జ‌న‌వ‌రి-మార్చి మ‌ధ్య భార‌త్‌లో 3-4 కోట్ల మందికి టీకాలు వేశారు. గ‌త 6 నెల్లో 1.1 మిలియ‌న్ల రెమిడెసివిర్ ఇంజెక్ష‌న్లు భార‌త్ నుంచి ఎగుమ‌తి చేశారు. ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంలో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉన్నప్ప‌టికీ, దేశంలో ఆక్సిజ‌న్ కొర‌త ఎదుర్కొంటున్నాం" అని ప్రియాంక విమ‌ర్శించారు. 

అటు, ప్ర‌ధాని మాత్రం దేశంలో ఆక్సిజ‌న్‌కు కొర‌త లేద‌ని, కావ‌ల‌సినంత స్టాక్ ఉంద‌ని అంటున్నారు. రాష్ట్రాలు మాత్రం ఆక్సిజ‌న్ నిల్వ‌లు నిండుకున్నాయ‌ని చెబుతున్నాయి. అయితే, చాలా ఆల‌స్యంగానైనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి పెంచేందుకు కేంద్రం భారీగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం. త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులో టీకా! క‌రోనా ముక్త్ భార‌త్‌! సాధ్య‌మే..నా?