ముంబైలో దారుణ పరిస్థితులు..రోదిస్తున్న వైద్యులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆసుపత్రులలో ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల కొరత తాండవిస్తోంది. సమయానికి ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. హాస్పిటల్ ఆవరణలోనే కొందరి ప్రాణాలు పోతుండగా.. మరికొందరు అంబులెన్స్ ల్లోనే చనిపోతున్నాయి. ముంబై హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కోసం రోగులు పడిగాపులు పడుతున్న దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లోనూ ఇలాంటి దారుణ పరిస్థితులే నెలకొన్నాయి. ముంబైలో వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. వైద్య సదుపాయాలు అందక కరోనా బాధితులు ప్రాణాలు వదులుతున్నారు. 

ముంబై పరిస్థితులపై ఒక వైద్యురాలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో డాక్టర్ తృప్తి గిలాడా రోదిస్తూ కనిపిస్తున్నారు.... ‘చాలామంది వైద్యుల మాదిరిగానే నేను కూడా ఎంతో ఆందోళన పడుతున్నాను. ముంబైలో పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. ఇక్కడి ఆసుపత్రులలోని ఐసీయూలలో ఖాళీలు లేవు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదు. మేము నిస్సహాయులం. ప్రస్తుత పరిస్థితిలో ఎమోషనల్ బ్రేక్‌డౌన్ అనేది డాక్టర్లందరిలోనూ ఎంతోకొంత ఉండనే ఉంది. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలి... అని డాక్టర్ తృప్తి గిలాడా ఆవేదన వ్యక్తం చేశారు.