హ‌నుమంతుడు మ‌న‌వాడే.. శ్రీరామ‌న‌వ‌మి వేళ శుభ‌వార్త‌..

రామ‌భ‌క్తుడు హ‌నుమాన్‌. ఆ ఆంజ‌నేయుడు మ‌న‌వాడే. మ‌న తెలుగు నేల‌పైనా చిరంజీవి జ‌న్మించాడు. ఆ మేర‌కు టీటీడీ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. సప్తగిరుల్లో ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని టీటీడీ తెలిపింది. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు.

హనుమంతుడి జన్మస్థానంపై అన్వేషణకు టీటీడీ కమిటీ వేసింది. క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశమై.. చ‌రిత్ర ఆధారాల‌ను ప‌రిశీలించి.. లోతుగా ప‌రిశోధ‌న చేసి.. హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించారు. ఆంజనేయస్వామి జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని ఆచార్య మురళీధర శర్మ చెప్పారు. అన్వేషణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 

కమిటీలో మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. టీటీడీ ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీరామ‌న‌వ‌మి వేళ‌.. రాములోరి క‌ల్యాణం సమ‌యంలో.. టీటీడీ అధికారికంగా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం రామ‌భ‌క్తుల‌ను ఆనందంలో ముంచెత్తింది. హ‌నుమంతుడు మ‌న‌వాడే నంటూ తెలుగువారంతా గ‌ర్వ‌ప‌డే సంద‌ర్భం ఇది. మ‌నంద‌రికీ ఇవాళ నిజ‌మైన పండుగ‌. జై బోలో రామ‌భ‌క్త హ‌నుమాన్ కీ.. జై....