రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల దుర్మరణం

చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మరణించారు.  ఈ దుర్ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద చోటు చేసుకుంది.  ఇదే కారులో ప్రయాణిస్తున్న అడిషనల్ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో  ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్న డీఎస్పీలు చక్రధరరావు,  శాంతారావులు సంఘటనా స్థలంలోనే మరణించారు. అడిషనల్ డీఎస్పీ ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   కాగా వీరు ఓ కేసు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపుకు దూసుకువెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఢీకొంది. అతి వేగం లేదా, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించిన సంఘటన పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించిన ఘటనపై తీవ్రదిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu