తెలంగాణలో ఆక్సిజన్ కొరత! ఈటల సంచలన వ్యాఖ్యలు 

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో 24X7 పనిచేస్తోందని  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.  వైద్య ఆరోగ్య శాఖకు తోడుగా హైదరాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి కరోనా రోగులకు చికిత్సను, వాక్సినేషన్ ను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సీఎం స్వయంగా కరోనా వైద్యానికి అవసమైన రెమిడెసివర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూస్తున్నారని, ఇప్పటికే  3-4 లక్షల డోసులను  ప్రోక్రూర్ చేసి పెట్టామన్నారు. 

తెలంగాణ ఆక్సిజన్ కొరత ఉందన్న వార్తలపై స్పందించారు మంత్రి ఈటల. ఆక్సిజన్ అనేది రాష్ట్ర పని కాదని. దేశవ్యాప్తంగా ఉన్న ఉక్కు కర్మాగారాల వద్ద స్టోర్ చేసి తీసుకురావాలని చెప్పారు. మనకు దగ్గరగా ఉన్న  విశాఖ, బల్లారి స్టీల్ ప్లాంట్ల నుంచి కేటాయింపులు తగ్గించి,  ఎక్కడో 3800 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూర్కీ నుంచి మనకు కేటాయించారన్నారు. దీంతో ఒక్క ట్యాంకర్ రావడానికి ఏడెనిమిది రోజులు పడుతోందన్నారు ఈటల. ట్రాన్స్ పోర్టు ఇబ్బందిగా ఉందని, తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ కేటాయించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కోరామన్నారు. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు మంత్రి ఈటల.

 తెలంగాణ తో పాటు అనేక రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు పేషెంట్లు వస్తున్నారన్నారు ఈటల. అందుకే ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం చూడాలన్నారు. ఇప్పటికైతే ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని, కానీ పేషెంట్లు పెరిగితే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందన్నారు మంత్రి. పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారనే, ఏడుస్తున్నారనో అవసరం లేకున్నా ఆక్సిజన్ ఇవ్వొద్దన్నారు. అవసరమైతే తప్ప ఆక్సిజన్ పెట్టవద్దను డాక్టర్లను కోరుతున్నామని తెలిపారు ఈటల. ఆక్సిజన్ ఉపయోగిస్తున్న పేషెంట్లను వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తూ పొదుపుగా వాడాలన్నారు. కావాలనుకున్నప్పుడు ఆక్సిజన్ దొరకదు కాబట్టి అనవసరంగా వృథా చేయవద్దని సూచించారు మంత్రి ఈటల. 

రాత్రి కర్ఫ్యూ పెట్టినప్పటికీ ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండాలని హెచ్చరించారు మంత్రి ఈటల. నగరాలు, పట్టణాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాత్రి పూట కర్ఫ్యూ పెట్టామని చెప్పారు. వరికోతలు, కొనుగోళ్ల సమయం సమయం కాబట్టి స్వీయ నియంత్రణతో పనిచేయాలని సూచించారు. పల్లెల్లో కరోనా విస్తరించకుండా గ్రామ పంచాయితీ పాలకమండళ్లు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్రజలు కూడా ఎవరో చెప్పాలని చూడకుండా జాగ్రత్తగా ఉండాలని, మున్సిపాలిటీల్లో కూడా కరోనా నియంత్రణ చర్యలు సమర్ధవంతంగా అమలు చేయాలని ఈటల రాజేందర్ తెలిపారు