టీఎస్ ఆర్టీసీపై సజ్జనార్ మార్క్.. ఆదాయం కోసం చార్జీల పెంపు? 

ఐపీఎస్ అధికారిగా తనదైన ముద్ర వేసుకున్నారు వీసీ సజ్జనార్. వరంగల్ ఎస్పీగా, సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు జరిగిన ఎన్ కౌంటర్లు సంచననంగా మారాయి. అమ్మాయిలపై దాడికి పాల్పడిన నిందితులు ఎన్ కౌంటర్లలో చనిపోవడంతో సజ్జనార్ ను జనాలు నీరాజనం పట్టారు. ఇటీవలే ఆయనను  ఆర్టీసీ ఎండీగా పంపించింది తెలంగాణ సర్కార్. డైనమిక్ ఆఫీసర్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేయడంపై విమర్శలు వచ్చాయి. అందులోనూ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో సజ్జనార్ కు పోస్టింగ్ ఇస్తే ఎలా అన్న చర్చ కూడా వచ్చింది.

అయితే ఆర్టీసీ ఎండీ తన మార్క్ చూపిస్తున్నారు సజ్జనార్. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు ప్రారంభించారు. అదే సమయంలో సిబ్బంది సంక్షేమంపైనా ఫోకస్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్. బస్సుల్లో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు నడుం బిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ బలోపేతానికి ప్రతిపాదనలు చేశారు వీసీ సజ్జనార్. 

ప్రగతి భవన్‌లో  జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సీఎస్ సోమేశ్‌కుమార్, రవాణా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్  పాల్గొన్నారు. కరోనా కాటుతో  ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయాయని, కాబట్టి ఇప్పుడు చార్జీలు పెంచక  తప్పదని  సజ్జనార్..  కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల రూ.550 కోట్లు, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరలు పెరగడం వల్ల రూ. 50 కోట్లు కలిసి ఏడాదికి దాదాపు రూ. 600 కోట్ల మేర భారం పడుతోందని, కాబట్టి ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిందేనని  కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 

లాక్‌డౌన్ కారణంగానే ఆర్టీసీ దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు నష్టపోయిందని, ఒక్క హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ. 90 కోట్ల మేర నష్టం వస్తోందని సజ్జనార్ నివేదించారు. ఇప్పుడు చార్జీలు పెంచకుంటే మరింత భారం మోయాల్సి వస్తుందన్నారు. చార్జీలు పెంచుతామని గతేడాది మార్చిలోనే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే తప్ప ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదని మంత్రి అజయ్ కుమార్, సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనపై సమీక్షించిన సీఎం.. చార్జీలను పెంచేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.  వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనను రూపొందించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. కరోనా దెబ్బకుతోడు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ఆ సమావేశంలో  సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణలో చివరిసారిగా డిసెంబరు 2019 లో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఈసారి కూడా 10 నుంచి 20 శాతం మేర చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. 20 శాతం పెంచితే కనుక రోజుకు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.