సోషల్ మీడియాలో కిషన్ రెడ్డిపై భారీ ట్రోలింగ్.. అసలు కథ ఇదే
posted on Feb 7, 2022 2:08PM
బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏనాడూ వివాదాల జోలికి వెళ్లలేదు. వివాదాస్పద కామెంట్లు చేయలేదు. బండి సంజయ్, అర్వింద్ లాగా ముస్లింల ప్రస్తావన కూడా ఏనాడూ తీసుకొచ్చిన దాఖలాల్లేవు. పైగా ఎంఐఎం నేతలతో తెరచాటుగా అంటకాగుతాడన్న పేరున్న నాయకుడు కూడా ఆయనే. ఎంఐఎం నేతలతో చాలా ఆత్మీయంగా మెలగడం మీడియా సాక్షిగా చాలాసార్లు కంటపడింది కూడా.
అలాంటి కిషన్ రెడ్డి హఠాత్తుగా అక్బరుద్దీన్ ఆనాడు వాడిన 15 నిమిషాల డైలాగ్ ను ఎత్తుకున్నారు. ట్విట్టర్లో తన ఒపీనియన్ షేర్ చేశారు. ఇహ చూస్కోండి.. నా సామిరంగా.. మొన్న ముచ్చింతల్ కు ప్రధాని వచ్చిన రోజు 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' అంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన క్యాంపెయిన్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లోకి వెళ్లినట్టే... అదే స్థాయిలో కిషన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తానేదో ఆశించి ఆ కామెంట్లను ఎత్తుకొని అనవసరంగా తొందరపడ్డానా అని కిషన్ రెడ్డి భావించేంతగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ఎంపీ అర్వింద్ ను సైతం వదల్లేదు.
ఇంతకీ కిషన్ రెడ్డి ఆ 15 నిమిషాల అంశాన్ని ఎందుకు కెలికారంటే... సమానత్వం తెలియని దేశ ప్రధాని... సమతా విగ్రహాన్ని ఆవిష్కరించడమే విడ్డూరంగా ఉందని కేటీఆర్ చేసిన ట్వీట్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. తమను పోలీసులు 15 నిమిషాలు వదిలేస్తే 100 కోట్లున్న హిందువులు బలవంతులా... 15 కోట్లున్న ముస్లింలు బలవంతులా తేలిపోతుందంటూ అక్బరుద్దీన్ విపరీత స్థాయిలో చేసిన రెచ్చగొట్టే కామెంట్లను ఉటంకిస్తూ... అలాంటి కామెంట్లు చేసే ఎంఐఎం నేతలను సీఎం కేసీఆర్, కేటీఆర్ వెనకేసుకొస్తారని, వాళ్లతోనే అంటకాగుతారని, ఎందరో హిందువులను రజాకార్ల చేత ఊచకోత కోయించిన నిజాం వారసులకే కొమ్ము కాస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.
దానికి రీకౌంటర్ గా టీఆర్ఎస్ సోషల్ మీడియా ఫోరం.. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా... అరెస్టు చేయవచ్చు కదా. మీ అధికారాన్ని మీకే ఒకరు గుర్తు చేయాలా.. వెళ్లి అరెస్టు చేయండి.. అంటూ సవాళ్లు రువ్వుతున్నారు. మరొకరు... అసలు అసదుద్దీన్ ఫ్యామిలీ లాయర్ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావేనని, ఆయనకు అనేక కేసుల్లో బెయిల్ తీసుకొచ్చేది ఆయనేనంటూ రెచ్చగొడుతున్నారు. కేసీఆర్ ఏదైనా బహిరంగ సభకు వెళ్లేటప్పుడు దట్టీ కట్టుకోవడం అలవాటు. ముస్లింల ఓట్ల కోసమే దట్టీ కట్టుకుంటాడన్న అర్వింద్ కామెంట్లను చూపిస్తూ... కిషన్ రెడ్డి కూడా కుడి భుజానికి దట్టీ కట్టుకున్న ఓ ఇమేజ్ ను పోస్ట్ చేశారు. కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకునే ఫొటోను కూడా షేర్ చేసి కామెంట్లు రాస్తున్నారు. దీంతో బీజేపీ వైపు నుంచి ఆన్సర్ లేకుండా పోయింది.
అయితే కిషన్ రెడ్డి చాలా కాలంగా పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదని, కేవలం పదవిని అడ్డు పెట్టుకొని మీడియాలో ప్రచారం చేసుకోవడమే తప్ప పార్టీ కోసం ఎక్కడా పని చేయడం లేదన్న విమర్శలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. కట్టర్ హిందూవాదిగా బండి సంజయ్, ఆ తరువాత అర్వింద్ లు దూకుడు ప్రదర్శిస్తుంటే కిషన్ రెడ్డి చాలా వెనుకబడిపోయారు. దీంతో పార్టీలో ఆయన మీద సదభిప్రాయం పోయిందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే హోంమంత్రిత్వ శాఖ నుంచి తప్పించి టూరిజంకు బదలాయించారని, అప్పట్లో భైంసాలో జరిగిన ఘటనపైనా కిషన్ రెడ్డి స్పందించకపోవడంతో... పార్టీ పెద్దలు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్ లకు చాలా హాట్ టాపిక్ తో కౌంటర్ ఇవ్వాలనుకొని కిషన్ రెడ్డి అభాసుపాలయ్యారంటున్నారు నెటిజన్లు.